వరకట్న దాహానికి అబల బలి

17 Jul, 2016 23:28 IST|Sakshi
= హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
= తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో నేరం అంగీకారం 
= భర్త, అత్తపై కేసు నమోదు 
 
పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్‌ కథనం ప్రకారం... వైఎస్సార్‌ జిల్లా ఇస్లాంపురానికి చెందిన ఆరిఫుల్లా బాషా, రమీజ దంపతుల మొదటి కుమారుడు షఫీ వివాహం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలాపురానికి చెందిన మహబూబ్‌ బాషా, షబీమున్నీసా దంపతుల కుమార్తె షబానా(25)తో ఆరేళ్ల కిందట అయింది. పెళ్లి సమయంలో ఆరు తులాల బంగారం, రూ.50 వేల నగదు కట్నంగా ఇచ్చారు.
 
 
షఫీ, షబానా  దంపతులకు ఆదిల్‌(5), అఫ్జల్‌(5) సహా అనిష్, అఫ్రానా అనే కవల పిల్లలు ఉన్నారు. షఫీ బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల నుంచి షబానాను షఫీ సహా అత్త రమీజా అదనపు కట్నం కోసం వేధించేవారు. వారి వేధింపులు తాళలేక గతంలో ఒకసారి షబాన పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు సర్దిచెప్పి మళ్లీ అత్తగారింటికి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మళ్లీ భర్త, అత్త కలసి షబానాను అదనపు కట్నం ఎందుకు తీసుకురాలేదంటూ వేధించారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వారి వేధింపులు తాళలేక రమీజా ఫోన్‌లో బంధువులకు విషయం తెలిపింది. వారొచ్చి మాట్లాడతామని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, అత్త కలసి షబానాను తీవ్రంగా కొట్టి చంపేశారు. 
 
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. 
షబానా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు షఫీ ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు షబాన బంధువులకు ఫోన్‌చేసి ‘మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని’ తెలిపాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి షబానా మృతదేహాన్ని తీసుకెళ్లి ఉరేసుకుని వైద్యులకు చెప్పగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఆదివారం ఉదయమే పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్‌ సంఘటనా స్థలానికి వెళ్లొచ్చారు. ఆ తరువాత ఆస్పత్రిలోని షబానా మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించాడు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా