దూసుకెళ్తున్న వెన్నపూస

21 Mar, 2017 22:35 IST|Sakshi
దూసుకెళ్తున్న వెన్నపూస
గెలుపు దిశగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి
- ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యత
- ‘మొదటి ప్రాధాన్యత’లో 12,677 ఓట్ల మెజార్టీ
- ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం
– కొనసాగుతోన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
– నేడు ఫలితం వెలువడే అవకాశం
- రెండు, మూడు స్థానాల్లో కేజేరెడ్డి, గేయానంద్‌
 
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యతను చాటుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజే రెడ్డి కంటే 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మూడో స్థానంలో నిలిచారు. అయితే.. విజయానికి అవసరమైన ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ గోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజేరెడ్డి,  గేయానంద్‌కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్‌ ఫిగర్‌’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్‌రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తుది ఫలితం నేడు వెలువడే అవకాశముంది.
 
మ్యాజిక్‌ ఫిగర్‌కు 14,173 ఓట్ల దూరంలో..
పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు మినహాయిస్తే తక్కిన 1,35,772 ఓట్లలో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్‌ ఫిగర్‌’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలోని కేజే రెడ్డి 26,850 , గేయానంద్‌ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకునేందుకు ముగ్గురిలో గోపాల్‌రెడ్డికే అవకాశాలు ఉన్నాయి.
 
బరిలోని 25 మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థుల నుంచి మొదలు పెట్టి.. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ‘ఎలిమినేట్‌’ చేస్తూ వస్తారు. వారికి పోలైన ఓట్లను ఇతర అభ్యర్థులకు జత చేస్తారు. ఈ క్రమంలో 22 మంది అభ్యర్థులు ఎలిమినేట్‌ అయినా ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో ఎలిమినేట్‌ రౌండ్‌లో 23వ అభ్యర్థి అయిన గేయానంద్‌కు పోలైన ఓట్లలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కింపుతో అభ్యర్థి విజయం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కనీసం 40–50 శాతం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తమకు వచ్చి ఉంటాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వీటి లెక్కింపు పూర్తవ్వాలంటే మరో పది గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం ఫలితం వెలువడనుంది.
 
మరిన్ని వార్తలు