స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుదాం

23 Jun, 2016 08:39 IST|Sakshi
స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుదాం

గ్రామజ్యోతి స్ఫూర్తితో బంగారు తెలంగాణ
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా బక్కలింగాయపల్లి
నల్లమలలో కలెక్టర్ శ్రీదేవి విస్తృత పర్యటన
పుష్కరఘాట్ల పనుల పరిశీలన


అచ్చంపేట రూరల్: మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకొని స్వచ్ఛపల్లెలుగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. బుధవారం అచ్చంపేట మండలం ఏజెన్సీ గ్రామమైన బక్కలింగాయపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నవీన్ చొరవతో గ్రామంలో 100శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను నిర్మించుకోవడం అభినందించ విషయమన్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో బక్కలింగాయపల్లిని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా ప్రకటించారు. ఆలోచన చేయకనే వెనకబాటుతనానికి గురవుతున్నామని, నవీన్‌లా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యతో వెనకబాటుతనాన్ని దూరం చేయవచ్చన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఇప్పటికే 53గ్రామాలను బహిరంగ మలమూత్ర  విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించామని చెప్పారు. ఇంకా 1500 గ్రామాలను టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు.


పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి: గువ్వల
అంతకుముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ నవీన్‌లా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు. నవీన్‌ను ఆదర్శంగా తీసుకుని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అచ్చంపేటను టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. పుష్కరఘాట్ల వద్ద గ్రామానికి చెందిన యువకులు వలంటీర్లుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పద్మనాభరావు, డీఈఓ విజయలక్ష్మి, సీఈఓ లక్ష్మినారాయణ, ఆర్‌డీఓ దేవేందర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎస్పీహెచ్‌ఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ సుధాకర్, ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, సీడీపీఓ దమయంతి, గ్రామ సర్పంచు కమల, టీఆర్‌ఎస్ నాయకులు మనోహర్, నర్సింహగౌడ్, సీఎంరెడ్డి, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. .
 
 
పుష్కరఘాట్ పనులను పరిశీలన

మండల పరిధిలోని బక్కలింగాయపల్లి సమీపంలో జరుగుతున్న పుష్కరఘాట్ పనులను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా పనులు చేపట్టాలని కోరారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సేవ్యానాయక్, సర్పంచు కమల, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పుస్తకాలను అమ్ముకుంటే చర్యలు
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను వారికే పంపిణీ చేయాలని, ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్ముకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ టీకే శ్రీదేవి హెచ్చరించారు. బుధవారం బక్కలింగాయపల్లిలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. పక్క స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకరావాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని, సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు చెప్పాలని డీఈఓ, ఎంఈఓలను అడిగారు. సరైన సమాధానం రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో పద్యాలు చదివించారు.

మరిన్ని వార్తలు