మరో అడుగు ముందుకు | Sakshi
Sakshi News home page

మరో అడుగు ముందుకు

Published Thu, Jun 23 2016 1:40 AM

మరో అడుగు ముందుకు

అంతరిక్ష వీధుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఎప్పటిలాగే మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. బుధవారం పీఎస్‌ఎల్‌వీ-సీ34 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను పంపి కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. 2008లో అతి చౌకగా ఒకేసారి పది ఉపగ్రహాలను పంపి ఔరా అనిపించుకున్న ఇస్రో... నిరుడు డిసెంబర్‌లో నిర్వహించిన ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఆరు ఉప గ్రహాలను పంపింది. ఇప్పుడు పంపిన ఇరవై ఉపగ్రహాల్లోనూ అతి తక్కువ బరువున్న జర్మనీకి చెందిన నానో ఉపగ్రహం మొదలుకొని 700 కిలోలకు మించి బరువున్న కార్టోశాట్-2 ఉపగ్రహాల వరకూ ఉన్నాయి. వీటన్నిటి బరువు దాదాపు 1,288 కిలోలు. ఇందులో కార్టోశాట్-2 ఉపగ్రహం అధునాతన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. అది అందించే సేవలు నిరుపమానమైనవి. తీర భూమి వినియోగం మొదలుకొని నీటి పంపిణీ నిర్వహణ వరకూ అనేకానేక అంశాల్లో వినియోగించగల కీలక అనువర్తితాలకు ఇది వేదికగా ఉంటుంది.

మిగిలిన 19 ఉపగ్రహాల్లో చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ విద్యార్థుల బృందం రూపొందించిన సత్యభామ శాట్, పుణెలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపకల్పన చేసిన ‘స్వయం’ ఉపగ్రహం ఉన్నాయి. ఇతర ఉపగ్రహాల్లో గూగుల్ యాజమాన్యానికి చెందిన స్కైశాట్ జెన్-2, అమెరికాకే చెందిన మరికొన్ని సంస్థల ఉపగ్రహాలు... కెనడా, జర్మనీ, ఇండొనేసియా దేశాల ఉపగ్రహాలు ఉన్నాయి. తాజా ప్రయోగంతో బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఘనత పొందిన రష్యా, అమెరికాల సరసన మన దేశం కూడా సగర్వంగా నిలబడింది. 2014లో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను అంత రిక్షానికి పంపగా అంతకు ముందు సంవత్సరం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రవేశపెట్టగలిగింది. అయితే ఈ మాదిరి ప్రయోగాలకు ఆ రెండు దేశాలూ వెచ్చించిన మొత్తాలతో పోలిస్తే ఇస్రోకు అయిన వ్యయం పది రెట్లు తక్కువ!

రెండున్నర దశాబ్దాలు వెనక్కెళ్తే ఇస్రో ప్రయాణంలో ఎన్నో వైఫల్యాలు కనబడతాయి. అనుకున్నది సాధించి తీరాలన్న సంకల్పం, పట్టుదల, ఏకాగ్రత వంటి లక్షణాలు అచిరకాలంలోనే ఆ సంస్థను విజయపథానికి నడిపించాయి. ఇస్రోకిది అసాధ్యం అన్న నోళ్లను మూతబడేలా చేయడమే కాదు... 1999లోనే యాంత్రిక్స్ కార్పొరేషన్ పేరిట అనుబంధ సంస్థను నెలకొల్పి ఉపగ్రహాలను పంపడం ద్వారా ఇస్రో ఆదాయాన్ని సముపార్జించడం మొదలుపెట్టింది. వాణిజ్య పరంగా కూడా తనకెవరూ సాటిరారని నిరూపించుకుంది. ఇంతవరకూ 21 దేశా లకు చెందిన 57 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టి 10 కోట్ల డాలర్లపైనే ఆదాయాన్ని పొందింది. ఇవిగాక మన దేశానికి చెందిన 35 ఉపగ్రహాలు వేర్వేరు కక్ష్యల్లో తిరుగుతూ ఇస్రో దక్షతనూ, మన దేశ ఘనతనూ ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఉపగ్రహాల ప్రయోగానికయ్యే వ్యయాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడంతోపాటు ఆ ప్రయోగాల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి మన శాస్త్రవేత్తలు నిరంతరం కృషిచేస్తున్నారు.

2014లో జీశాట్-16ను ఫ్రెంచి గయానా నుంచి ఎరియాన్-5 సాయంతో ప్రయోగించిన మన శాస్త్రవేత్తలు వచ్చే సెప్టెంబ ర్‌లో జీశాట్-18ని ఇక్కడినుంచే పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మన ఇస్రో సాధిస్తున్న విజయాలు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. వాణిజ్య పరంగా వాటికి సవాళ్లు విసురుతున్నాయి. ఉపగ్రహాల ప్రయోగానికి తాము వసూలు చేసే మొత్తాన్ని తగ్గించుకోక తప్పని స్థితిని కల్పిస్తున్నాయి. వచ్చే అయిదారేళ్లలో వివిధ దేశాలు దాదాపు వేయికి పైగా ఉపగ్రహాలను పంపుతాయన్న అంచనాలున్నాయి. కనుక ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఆర్జించడానికి అవకాశాలున్నాయి. దీనికి మన ఇస్రో సమయా త్తమవుతోంది.  

సాధారణంగా ఏ సమస్యలోనైనా ఉండే సంక్లిష్టతను చెప్పడానికి రాకెట్ సైన్స్‌తో దానికి పోలిక తెస్తారు. ఎందుకంటే ఎన్నో వ్యవస్థలు, ఉపవ్యవస్థలు నిర్దిష్టంగా, నిర్దుష్టంగా పనిచేస్తే తప్ప ఒక రాకెట్ ఖచ్చితమైన వేగంతో దూసుకెళ్లడం, మోసుకెళ్లిన ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ఉంచడం సాధ్యం కాదు. ఇక బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమన్నది మరిన్ని సంక్లిష్టతలతో నిండి ఉండేది. అందుకే రాకెట్ ప్రయోగం విషయంలో ప్రతి సూక్ష్మ విషయాన్నీ అత్యంత నిశితంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయన్న నిర్ధారణ తర్వాతే ప్రయోగానికి సిద్ధపడతారు. ఏ చిన్న లోపం ఉన్నదన్న సందేహం కలిగినా ప్రయోగాన్ని ఆపేస్తారు. భూమికి 512 కిలోమీటర్ల ఎత్తున 26.5 నిమిషాల వ్యవధిలో ఈ 20 ఉపగ్రహాలనూ జయప్రదంగా ఉంచగలగటం మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం. సాంకేతికంగా ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉండే ఈ ప్రయోగంలో కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని ఒక కక్ష్యలోనూ, మిగిలిన ఉపగ్రహాలను స్వల్పదూరంలో ఉండే మరో కక్ష్యలోనూ ప్రవేశపెట్టడమన్నది ఒక సాంకేతిక విన్యాసమే.

ఎన్నో అవాంతరాలనూ, ప్రతికూల పరిస్థితులనూ ఎదుర్కొంటూ అంచెలం చెలుగా ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. 1975లో తొలిసారి ‘ఆర్యభట’ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం పట్టా లెక్కడానికి దాదాపు పదేళ్లు పట్టింది. సాంకేతికతను ఇవ్వడానికి నిరాకరించే సంపన్న దేశాలొకవైపు... ఇస్రో ప్రాముఖ్యతనూ, అది చేపట్టే ప్రయోగాల అవసరాన్నీ గుర్తించలేని మన పాలకులు మరోవైపు ఇస్రోను ఇరకాటంలోకి నెట్టారు. ప్రజానీకానికి నిత్యజీవితంలో ఎంతో మేలు చేసేందుకు తమ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పినా చాలాకాలం చెవికెక్కించు కున్నవారు లేరు. అగ్రరాజ్యమైన అమెరికాలో నాసా మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడాన్ని అటుంచి, మన పొరుగునున్న చైనా ఎంతో శ్రద్ధాసక్తులతో అంతరిక్ష ప్రయోగాలకు వెచ్చిస్తున్న మొత్తాన్నయినా పరిగణనలోకి తీసుకోవాలన్న దృష్టి లేకపోయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇస్రోకు ప్రస్తుతం లభిస్తున్న సహకారం దాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్న భరోసానిస్తోంది. అది కొనసా గాలని ఆశిద్దాం.
 

Advertisement
Advertisement