ఈసారైనా జరిగేనా?

31 Jul, 2016 17:02 IST|Sakshi
ఈసారైనా జరిగేనా?
నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి ఆరేళ్లు
గత ఏడాది అక్టోబర్‌లోనే కోర్టు ఆదేశాలు
నిర్వహణపై సర్కారు ఉదాసీనం
 
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి ఆరేళ్లవుతోంది. అప్పటి నుంచి నగరపాలకSసంస్థ ప్రత్యేకాధికారుల పాలనలోనే మగ్గుతోంది. దీంతో నగర ప్రజల సమస్యలు తీర్చే నాధుడే కరువయ్యాడు. అధికారుల్లో జవాబుదారీతనం లోపించడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఈ ఏడాది నవంబర్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేశారు. కొత్తగా అర్హులైనవారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 
తొలగిన అడ్డంకులు...
నగరపాలకసంస్థలో 2011లో పది గ్రామపంచాయతీలను విలీనం చేశారు. డివిజన్ల సంఖ్య 52 నుంచి 57కు పెంచారు. మేయర్‌ అభ్యర్థికి సంబంధించిన రిజర్వేషన్‌ సైతం ప్రకటించారు. ఓసీ జనరల్‌కు మేయర్‌ సీటు కేటాయించారు. 2014 మే 25న 57 డివిజన్ల పున ర్విభజన కోసం అప్పటి కలెక్టర్, నగరపాలకSసంస్థ ప్రత్యేకాధికారి ఎస్‌.సురేష్‌కుమార్‌ సమక్షంలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డివిజన్ల పునర్విభజన మొత్తం గందరగోళంగా ఉందని, ఏకపక్షంగా జరిగిందని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా, గతేడాది జూన్‌లో కోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో మరోసారి డివిజన్ల పునర్విభజన చేయాలని కోర్టు ఆదేశించింది. లాలుపురం, డివిజన్ల అంశాలపై గత ఏడాది అక్టోబర్‌లోనే హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌ ఆయా అంశాలను పరిశీలించి వెంటనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 
ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇస్తేనే...
నగరపాలకసంస్థ ఎన్నికల ప్రక్రియకు కనీసం మూడునెలల సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన తర్వాత డివిజన్ల పునర్విభజనకు కనీసం 45 రోజుల సమయం పడుతుంది. ఓటర్ల జాబితా రూపొం దించడం, ఆ తర్వాత డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించడం తదితరాలకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. అంటే ఎన్నికలు నవంబర్‌లో జరగాలంటే నోటిఫికేసన్‌ ఆగస్టులో ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 
టీడీపీ నేతల మేకపోతు గాంభీర్యం...
టీడీపీ నాయకులు ఎన్నికలంటే భయపడుతూనే మేకపోతు గాంభీ ర్యం ప్రదర్శిస్తున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు, బీజేపీతో సయోధ్య కొరవడటం, మరోపక్క రెండు పార్టీలపై ప్రత్యేక హోదా తదితర హామీల అమలులో వైఫల్యంపై ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో ఎన్నికలంటేనే అధికార పార్టీ నాయకులు వెనకడుగు వేస్తున్నారు.
మరిన్ని వార్తలు