జనసంద్రమైన వాడపల్లి

5 Aug, 2017 23:41 IST|Sakshi
జనసంద్రమైన వాడపల్లి
-మార్మోగిన గోవిందనామం 
-భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు 
-వీఐపీల రాకతో గంటల తరబడి క్యూలైన్‌లో..
-ఉత్తర ద్వార దర్శనానికి బ్రేక్‌ 
 ఆత్రేయపురం (కొత్తపేట):కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం శ్రావణమాసం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్ని దర్శించుకున్నారు. ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది.  శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు.   ఉదయం సుప్రభాత సేవ,  విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి మొక్కుబడులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కరుటూరి నరసింహరావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో  పర్యవేక్షకులు  సాయిరామ్‌ , శ్రీదేవి  ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు  ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సై జేమ్స్‌ రత్నప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ట్రాఫిక్‌ స్తంభించడంతో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. లొల్ల వంతెన వద్ద గంట సేపు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఆలయంలో ప్రముఖుల తాకిడి అధికంగా ఉండటంతో గంటల తరబడి క్యూలైన్‌లు నిలిపివేయడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్‌లో భక్తులు సుమారు 3 గంటల పాటు పడిగాపులు పడ్డారు. ఆలయంలో ఉత్తర ద్వారం నిలుపుదల చేయడంతో పాటు మరో మార్గం ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని భక్తులు వాపోయారు. ప్రముఖులు, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ప్రధాన మార్గం ద్వారా వెళ్లడంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం అష్టకష్టాలు పడ్డారు. స్వామి వారి సన్నిధిలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసస్నకుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల సత్కారం అందుకున్నారు. ఆలయ చైర్మన్‌ నరసింహరావు, ఈవో సత్యనారాయణరాజు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. 
మరిన్ని వార్తలు