ఆయన తీరేం బాగాలేదు

6 Oct, 2016 23:24 IST|Sakshi
చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌
– బొత్తిగా మా మాట వినడం లేదు
– పార్టీ కేడర్‌ దెబ్బతింటోంది
–కలెక్టర్‌పై సీఎంకు ఎమ్మెల్యేల ఫిర్యాదు !
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ వ్యవహార శైలిపై అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. కలెక్టర్‌ తీరు వల్ల జిల్లాలో తమ మాటకు ఏ మాత్రం విలువ లేకుండా పోతుందని మండిపడుతున్నారు. గురువారం విజయవాడలో జరిగిన టీడీపీ సాధికార సదస్సులో కలెక్టర్‌పై పలువురు పార్టీ నేతలు, శాసనసభ్యులు సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలం అయినప్పటికీ జిల్లాలో తమ సిఫార్సులు ఏవీ పనిచేయడం లేదనీ, మండల, డివిజన్‌ స్థాయి అధికారులెవ్వరూ తమ మాట బొత్తిగా వినడం లేదని సీఎంకు చెప్పారు. తానే జిల్లాకు సీఎంనన్న తరహాలో కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ వ్యవహరిస్తున్నారనీ, అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎంకు వివరించినట్లు సమాచారం. రేషన్‌డీలర్లు,అంగన్‌వాడీల నియామకాల్లో కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ అన్నీ సొంత నిర్ణయాలు తీసుకుంటుండటం వల్ల నియోజకవర్గాల్లో తమకు విలువ లేకుండా పోతుందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గోడు వెళ్లబోసుకున్నారని సమాచారం. ఆయన వ్యవహార శైలి వల్ల జిల్లాలో టీడీపీ  దెబ్బతింటోందనీ, ఏ పనులూ కానందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని కొందరు నేతలు సీఎంకు చెప్పినట్లు తెల్సింది. పార్టీ నాయకులు, శాసనసభ్యులు చెప్పిన విషయాలన్నింటినీ విన్న తరువాత తానే స్వయంగా మాట్లాడతానని సీఎం సర్ధి చెప్పినట్లు సమాచారం. 
 
మరిన్ని వార్తలు