జిల్లా వ్యాప్తంగా హోటళ్ల బంద్‌

30 May, 2017 23:27 IST|Sakshi
జిల్లా వ్యాప్తంగా హోటళ్ల బంద్‌
– నగరంలో ర్యాలీ.. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
కర్నూలు(టౌన్‌): హోటళ్ల రంగంపై పెంచిన జీఎస్టీని భారీగా తగ్గించాలని కర్నూలు జిల్లా హోటల్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా హోటళ్లను బంద్‌ చేశారు. హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కురాడి మురళీధర్‌ కల్కూర ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో తిరుగుతూ హోటళ్లను బంద్‌ చేయించారు. రెండు రోజులు ముందుగానే బంద్‌ సమాచారం ఉండటంతో పలువురు స్వచ్ఛందంగా హోటళ్లను మూసివేశారు. స్థానికంగా రాజ్‌విహార్‌ సెంటర్‌లో పుల్లారెడ్డి స్వీట్స్‌ షాపు తెరచి ఉంచడంతో వారితో మాట్లాడి మూయించారు.
 
 నగరంలో ర్యాలీ అనంతరం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట అసోసియేషన్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.   గాంధీ విగ్రహానికి పూల మాల వేశారు. ధర్నా నుద్దేశించి అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీధర్‌ కల్కూర మాట్లాడుతూ పెంచిన పన్నుతో హోటల్‌ రంగం కుదేలవుతుందన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా కర్నూలు నగరంలో హోటళ్లు పూర్తిగా బంద్‌ కావడంతో ప్రయాణికులు, పాదాచారులు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెస్‌లు సైతం మూత పడ్డాయి.   కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు భోజనం దొరక్క అవస్థలు పడ్డారు.
 
మరిన్ని వార్తలు