జిల్లా మీదుగా ఐవోసీ పైపులైన్‌

17 Dec, 2016 02:13 IST|Sakshi
కామవరపుకోట : ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఉత్పత్తి చేసే ఆయిల్‌ను పరదీప్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పైపులైన్‌ ద్వారా సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ప్రాజెక్ట్‌ కాంపినెంట్‌ అధారిటీ అనిల్‌ జెస్సీ తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో రైతుల పొలాల మీదుగా 1,150 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేయనున్నామన్నారు. సర్వే ఆధారంగా ఒక్కో రైతు పొలంలో 18 మీటర్ల మేర భూమి తీసుకుంటామని, ఇందుకు మార్కెట్‌ విలువలో పదో వంతు ధర చెల్లిస్తామన్నారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 31 మండలాల్లో 34 గ్రామాల ద్వారా పైపులైన్‌ వెళుతుందని చెప్పారు.  కామవరపుకోట మండలంలో యడవల్లి, రామన్నపాలెం, కామవరపుకోట, మంకినపల్లి, మైసన్నగూడెం, ఆర్‌.నాగులపల్లి, గుంటుపల్లి గ్రామాల మీదుగా పైపులైన్‌ వెళుతుందన్నారు. ఆయా గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందని చెప్పారు.
పైపులైన్‌తో ప్రయోజనాలెన్నో..
పైపులైన్‌   ద్వారా ఆయిల్‌ సరఫరా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఐఓసీ చీఫ్‌ కనస్ట్రక్షన్‌ మేనేజర్‌ ప్రసాద్‌ తెలిపారు. ట్యాంకర్లు, వ్యాగన్ల వంటి వాటి ద్వారా సరఫరా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందన్నారు. అంతే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ఆయిల్‌ సరఫరాకు ఆటంకం ఉందన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ఫిల్లింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  
 

 

మరిన్ని వార్తలు