‘తోడేళ్ల ఫలహారం’ బట్టబయలు

19 Jan, 2016 03:24 IST|Sakshi
167 సర్వే నంబర్‌లో వృథాగా ఉన్న బోరును పరిశీలిస్తున్న ఆర్డీవో

- ‘పాలమూరు-రంగారెడ్డి’లో అక్రమాలపై ఆర్డీవో విచారణ
- కరివెనలో క్షేత్రస్థాయి పర్యటన.. అవకతవకల గుర్తింపు
- నేడు మరిన్ని భూములు, అంచనాల పరిశీలన
 
సాక్షి, హైదరాబాద్, మహబూబ్‌నగర్:
‘పాలమూరు పరిహారంలో తోడేళ్ల ఫలహారం’ వ్యవహారం బట్టబయలైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ పరిహారంలో అక్రమాలపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు. భూత్పూర్ మండల పరిధిలోని కరివెన గ్రామంలో మహబూబ్‌నగర్ ఆర్డీవో హన్మంతరెడ్డి క్షేత్రస్థాయి విచారణ జరిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆధారంగా... కరివెన గ్రామ శివారులోని 167, 168, 169, 170, 190, 191, 192,

193 సర్వే నంబర్లలో భూములు, పరిహారం లెక్కలను ఆయన పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులు రెండు పంటల భూములుగా పేర్కొన్న భూములకు, బోర్లకు సంబంధించి పలు అవకతవకలను గుర్తించారు. కొన్ని బోర్లలో కొద్దిపాటి నీటివసతి ఉందని, అయితే ఆ నీటితో ఎకరాకు మించి రెండు పంటలు పండించే అవకాశం లేదని నిర్ధారించారు. 167 సర్వే నంబర్‌లోని పత్తి చేలల్లో బోరు ఉన్నా.. విద్యుత్ కనెక్షన్ ఉన్న ఆనవాలు కనిపించలేదు. 170 సర్వే నంబర్‌లో భూమి బీడుగా ఉన్నా... గతంలో ఎప్పుడో ఉన్న బోరుకు పైపులు బిగించి పరిహారం వచ్చేలా స్థానిక రెవెన్యూ అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఆర్డీవో ఏడు బోర్లను పరిశీలించగా నాలుగింటిలో మాత్రమే కొద్దిపాటి నీరున్నట్లు, మరో మూడింటిలో నీరు పడలేదని గుర్తించారు. ఇవి కూడా గతంలోనే పాడుబడిన బావులుగా ఆయనకు ప్రాథమికంగా సమాచారం అందింది. దీంతో పరిహారం పేరిట జరుగుతున్న అక్రమాలపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాభావంతో పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని, మంగళవారం మిగతా సర్వే నంబర్లలో క్షేత్రస్థాయి విచారణ చేస్తామని ఆర్డీవో తెలిపారు. విచారణ సమయంలో ఆర్డీవో వెంట భూసర్వేశాఖ డీఐ శివకుమార్, మండల సర్వేయర్ వెంకటేష్, ఆర్‌ఐ గురురాజరావ్, వీఆర్వో హన్మంత్ ఉన్నారు. స్థానిక తహసీల్దార్ జ్యోతి ఇక్కడికి రాకపోవడం గమనార్హం.

మరోవైపు భూపరిహారం పంపిణీ అక్రమాలు వెలుగులోకి రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులు కంగుతిన్నారు. దీంతోపాటు కరివెన ముంపు బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ పొలాలకు వచ్చిన పరిహారంపై చర్చించుకోవడం గమనార్హం. ఇదే గ్రామానికి చెందిన ఓ టీఆర్‌ఎస్ నేత సోదరులు కూడా ఇక్కడికి వచ్చి పరిహారంలో తమకు వాటా ఉందని వాదులాడుకున్నారు.

అక్రమాలపై విజిలెన్స్ కన్ను!
పరిహారం అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దృష్టి సారించింది. సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చూసిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే విచారణ చేపట్టే అవకాశముంది. ఇక పోలీస్ ఇంటలిజెన్స్ సైతం ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది.

ఎలాంటి అక్రమాలు లేవు: తహసీల్దార్
పాలమూరు ప్రాజెక్టు భూపరిహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని భూత్పూర్ తహసీల్దార్ జ్యోతి వివరణ ఇచ్చారు. రక్షిత కౌలుదారు ఉన్న సర్వే నంబర్లకు నోటిఫికేషన్ జారీ చేసినా నిర్దేశిత సమయంలో.. ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. భూనష్ట పరిహారం కేవలం భూములకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, అందులోని బావులు, చెట్లు, బోర్లకు ప్రత్యేకంగా పరిహారం ఇవ్వడానికి వీలుపడదని చెప్పారు.

ఒక బోరు కింద కనీసం మూడెకరాల భూమిని రెండు పంటల భూమిగా పరిగణించామని, ఎక్కువ పారుదల గల బోరున్న చోట మూడెకరాల కన్నా ఎక్కువ భూమిని రెండు పంటల భూమిగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. భూకొనుగోలు పథకం కింద సేకరించిన భూములను మినహాయించి, అవే సర్వే నంబర్లలో ఉన్న మిగులు భూమికి పరిహారం ఇప్పించామని, ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చారు.

అక్రమాల నిగ్గు తేల్చండి: సీఎంకు పొంగులేటి లేఖ
పాలమూరు భూపరిహారంలో అక్రమాల నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పరిహారం చెల్లింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని... దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ప్రతిని మంత్రి టి.హరీశ్‌రావుకు పంపారు.

>
మరిన్ని వార్తలు