జూబ్లీహిల్స్‌లో బోగస్‌ డాక్యుమెంట్లతో కబ్జా..

11 Sep, 2016 21:15 IST|Sakshi

► ముగ్గురి అరెస్ట్‌
బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో రూ.10 కోట్ల విలువ చేసే 1200 గజాల ఖరీదైన ప్లాట్‌ను ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు కబ్జాదారులను జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు. దారుసలాంకు చెందిన అమృత్‌ కల్‌రేజా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లోని ప్లాట్‌ నెం.864ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు స్కెచ్‌ వేశాడు.

ఇందులో భాగంగా తమ సమీప బంధువు బ్రిజేష్‌ కుమార్‌ బజాజ్,  అనుచరుడు అస్గర్‌ అలీతో కలిసి శనివారం ఈ ప్లాట్‌లోకి వెళ్లి చుట్టూ గోడలు నిర్మించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్‌ సొసైటీ కార్యదర్శి టి.హన్మంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు  అమృత్‌ కల్‌రేజాతో పాటు బ్రిజేష్‌కుమార్‌ బజాజ్, అస్గర్‌ అలీలను అరెస్ట్‌ చేశారు. 1982లో ఈ ప్లాట్‌ను బ్రిజ్వేశ్వర్‌నాథ్‌ గుప్తాకు కేటాయించారు.

అయితే సకాలంలో సభ్యత్వ రుసుము చెల్లించకపోవడంతో ఆయనకు ఇంకో ప్లాట్‌ కేటాయించారు. ఈ ప్లాట్‌ రిజిష్ర్టేషన్ జరగకముందే ఆయన మృతి చెందారు. బ్రిజ్వేశ్వర్‌నాథ్‌ కుమారుడు రాజేంద్రనాథ్‌ 1999లో ఈ ప్లాట్‌ తనకు అలాట్‌ అయిందంటూ బోగస్‌ లేఖ సృష్టించి ఆ మేరకు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగానే అమృత్‌ ఈ ప్లాట్‌పై కన్నేశాడు. ధృవపత్రాలను నకిలీవి సృష్టించి ఆక్రమించేందుకు పథకం వేసి కటకటాలపాలయ్యారు.

>
మరిన్ని వార్తలు