కళాఉత్సవ్‌లో జిల్లాకు రెండు ప్రథమాలు

6 Oct, 2016 21:31 IST|Sakshi
కళాఉత్సవ్‌లో జిల్లాకు రెండు ప్రథమాలు
కాకినాడ కల్చరల్‌ :
రాష్ట్ర స్థాయి  కళాఉత్సవ్‌–2016 పోటీలలో మన జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. విజయవాడ బిషప్‌ గ్రేసీ ఉన్నత పాఠశాలలో బుధ, గురువారాల్లో జరిగిన విజువల్స్‌ ఆర్ట్స్‌ పోటీలలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తూరంగిపేట విద్యార్థులు ప్రదర్శించిన ‘అమరావతి–ప్రజల రాజధాని–చారిత్రక విశిష్టత’ అంశం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందింది. థియేటర్‌ ఆర్ట్స్‌ అంశంలో మల్లాడి సత్యలింగనాయకర్‌ చారిటీస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల (కాకినాడ) విద్యార్థులు ప్రదర్శించిన ‘విముక్తి నాటిక’ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందింది. రాష్ట్ర స్ధాయిలో ప్రథమస్థానం పొంది నవంబర్‌ 14 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరుగనున్న జాతీయ కళాఉత్సవ్‌ – 2016 పోటీలకు ఎంపికైన ప్రాజెక్టులకు కృష్ణ, గుంటూరు జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ డా.ఎ.ఎస్‌.రామకృష్ణ , పట్టభద్రుల ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరావు బహుమతులు అందజేశారు. జాతీయ స్థాయి కళాఉత్సవ్‌–2016కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు కందుకూరి పాల్‌రాజ్, శేషగిరిరావు, పి.కాంతాభిలాష, కేసరి శ్రీనివాసరావు, బి.నాగేశ్వరావులను విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.నరసింహారావు, కాకినాడ ఉప విద్యాశాఖాధికారి డి.వాడపల్లి, పిఠాపురం ఉప విద్యాశాఖాధికారి బి.నాగేశ్వరావు అభినందించారు.
 
మరిన్ని వార్తలు