లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదు

29 Jul, 2017 23:29 IST|Sakshi
లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదు
 - ముద్రగడ చేపట్టిన పాదయాత్ర జరిగి తీరుతుంది
- కాపు జేఏసీ నాయకులు
కిర్లంపూడి (జగ్గంపేట): లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదని తమనాయకుడు ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర జరిగి తీరుతుందని జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, గౌతు స్వామి తదితరులు స్పష్టం చేశారు. శనివారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో కొందరు మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుతోపాటు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామాంజనేయులు ముద్రగడ ఉద్యమాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారు. కాపు కులాన్ని వేరు చేసి ఓట్లు అడిగింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అధికారం వచ్చిన వెంటనే ఆరు నెలల్లోపు కాపు, తెలగ, బలిజ వంటి కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పింది చంద్రబాబు కాదా అన్నారు. కాపు ఓట్లు ద్వారా లబ్ధి పొంది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా ఇంత వరకు రిజర్వేషన్‌ ప్రక్రియను పూర్తి చేయకపోవడం చంద్రబాబు విధానం తేటతెల్లమవుతుందన్నారు.ముద్రగడ వెంట ఎవరూ లేరనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోను ఇన్ని వేల మంది పోలీసులతో పోలీస్‌ పికెట్‌లు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. ముద్రగడను పాదయాత్రకు పంపించండి...అప్పుడు ముద్రగడ వెంట ఎంత మంది ఉన్నారో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ నిరంతరం 144, సెక‌్షన్‌ 30 అమలులో పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వాలని కోరారు. ఈ సమావేశంలో తనిశెట్టి వెంకటేశ్వరావు, కొత్తెం బాలకృష్ణ, అడబాల శ్రీను, ఓరుగంటి చక్రం, వాసా రాఘవరావు, ఎస్సీ నాయకుడు మూరా సహదేవుడు, బీసీ నాయకుడు ఎల్లపు తాతారావు, ఓసీ నాయకులు మండపాక చలపతి, గౌతు వెంకటేశ్వరరావు, దాడి నారాయణమూర్తి, ఒన్నెం శ్రీను, సూరత్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు