కేటీఆర్‌తో బెంగాల్ బృందం భేటీ

5 Nov, 2015 02:03 IST|Sakshi
కేటీఆర్‌తో బెంగాల్ బృందం భేటీ

♦ వాటర్ గ్రిడ్ పై బెంగాల్ ఆసక్తి
♦ రాష్ట్రానికి వచ్చిన ముగ్గురు అధికారుల బృందం
♦ తమ రాష్ట్రంలో ప్రాజెక్టు ప్రారంభంపై చర్చలు
 
 సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పథకం అధ్యయనానికి రాష్ట్రానికి విచ్చేసిన పశ్చిమబెంగాల్ అధికారుల బృందం తెలంగాణలో పర్యటించింది. అక్కడి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్‌కు చెందిన అధికారుల బృందం బుధవారం  క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును కలుసుకుంది. తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తితో ఉన్నారని ఈ బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు లక్ష్యాలు.. అమలు తీరు, విధివిధానాలను మంత్రి అధికారులకు వివరించారు.

తెలంగాణలోని ఆడపడుచులెవరూ తాగునీటికి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగా ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనను అభినందించిందని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు అవలంబించిన విధానాలను మంత్రి అధికారులకు వివరించారు.

బెంగాల్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటే అందుకు సంబంధించిన ఇంజనీరింగ్, సాంకేతిక సహకారాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బెంగాల్‌లో ప్రస్తుతమున్న నీటి సమస్యను అధిగమించేందుకు తమ సీఎం మమతా బెనర్జీ వాటర్ గ్రిడ్ లాంటి పథకమే శాశ్వత పరిష్కారమని భావిస్తున్నారని అధికారుల బృందం మంత్రికి వివరించింది. అంతకు ముందు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి బెంగాల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బెంగాల్ నుంచి వచ్చిన డెరైక్టర్ అనిమేశ్ భట్టాచార్య, ఈఈ పిడేయ్ ఏ రాయ్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు