నిరుద్యోగ యువతను మోసం చేసిన బాబు

17 Dec, 2016 00:12 IST|Sakshi
  •  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
  • గుంతకల్లు టౌన్‌:

    ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి పేరుతో యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని  వైఎస్సార్‌సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు.  స్థానిక పార్టీ కార్యాలయంలో  వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.80 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేపర్‌ నోటిఫికేషన్, మెరిట్,  కలెక్టర్‌ సెలెక‌్షన్‌)విధానాన్ని అమలు చేసి వీటిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తెచ్చి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. అధికార పీఠం కోసం అడ్డమైన హామీలిచ్చి చంద్రబాబు అన్నివర్గాల ప్రజల్ని మోసం చేశారన్నారు.  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టో నియంత్రణ కమిటీ వేసి ప్రాసిక్యూట్‌ చేయాలన్నారు. గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని గోపాల్‌రెడ్డి ప్రకటించారు. వై వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డిను గెలిపించుకుందామని  పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్, కౌన్సిలర్లు గోపి, రంగన్న, నగేష్, మాజీ కౌన్సిలర్‌ సుంకప్ప, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు