హరీశ్‌బాబుకు టికెట్‌ ఖరారు | Sakshi
Sakshi News home page

హరీశ్‌బాబుకు టికెట్‌ ఖరారు

Published Mon, Oct 23 2023 12:12 AM

- - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన బీజేపీ తొలి జాబితాను ఎట్టకేలకు ఆదివారం ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే జిల్లాలోని సిర్పూర్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు ఖరారయ్యారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు.

రెండో జాబితాలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి శనివారమే జాబితా ప్రకటించాల్సి ఉండగా.. మూడు సీట్ల ఖరారు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాత్రం అభ్యర్థిత్వాలు ఖరారైన వారికి స్వయంగా ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో శనివారమే పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు.

బలమైన రాజకీయ నేపథ్యం..
పాల్వాయి హరీశ్‌బాబుకు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన పాల్వాయి హరీశ్‌బాబు.. ఆ తర్వాత చైన్నెలోని శ్రీరామచంద్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎస్‌.(ఆర్థోపిడిక్స్‌) చేశారు.

పీడియాట్రి ఆర్థోపిడిక్‌ సర్జన్‌గా వైద్యవృత్తిని ప్రారంభించారు. 2017 నవంబర్‌లో రాజకీయ అరంగ్రేటం చేశారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాను రూపొందించుకుని ప్రజల్లోకి వచ్చారు. మొదట 2018లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కోనేరు కోనప్పపై పోటీ చేసి 59,052 ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ వర్గాలకు మద్దతుగా పోరాటాలు చేయడంతోపాటు మారుమూల గ్రామాల్లో పాదయాత్ర చేసిన ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement