అమెరికాకు షాకిచ్చిన చైనా | Sakshi
Sakshi News home page

అమెరికాకు షాకిచ్చిన చైనా

Published Sat, Dec 17 2016 12:09 AM

అండర్‌ వాటర్‌ డ్రోన్‌ - Sakshi

వాషింగ్టన్‌: దక్షిణచైనా సముద్రం జలాలపై తన హక్కులు కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతానని ప్రకటించిన చైనా అన్నంత పని చేసింది. సముద్రగర్భంలో పరిశోధనలు చేస్తోన్న (అమెరికా నౌకాదళానికి చెందిన) అండర్‌ వాటర్‌ డ్రోన్‌ ను స్వాధీనం చేసుకుని, అగ్రరాజ్యానికి గట్టి షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఏదేనీ రక్షణ వాహనాన్ని చైనా బంధించడం వర్తమాన చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అమెరికా నౌకాదళానికి చెందిన సముద్రశాస్త్ర పరిశోధక నౌక(యూఎస్‌ఎన్‌ఎస్‌-బౌదిక్‌‌) కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నదని, ఆ నౌక నుంచి సముద్ర గర్భంలోకి పంపిన (అండర్‌ వాటర్‌) డ్రోన్‌ ఒకదానిని డిసెంబర్‌ 15న చైనా నౌకాదళం స్వాధీనం చేసుకున్నదని యూఎస్‌ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో ఉన్న డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని చైనా తెంపరితనం ప్రదర్శించిందని, ఒక పరిశోధక వాహనాన్ని బంధించడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కులు లేవని అమెరికా మండిపడింది. వెంటనే డ్రోన్‌ను అప్పగించేలా చైనాపై అమెరికా దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చింది. కాగా, అసలా డ్రోన్‌తో సముద్రగర్భంలో ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం అమెరికా సమాధానం ఇవ్వలేదు.

అమెరికన్‌ అండర్‌ వాటర్‌ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించిన చైనా నౌకాదళం.. డ్రోన్‌ కదలికలపై అనుమానాలను వ్యక్తపర్చింది. తమ నౌకాదళానికి చెందిన రహస్య సమాచారం సేకరించేందుకే దక్షిణ చైనా సముద్రంలో పరిశోధనల పేరిట అమెరికా నాటకాలాడుతోందని చైనా మండిపడింది. డ్రోన్‌ను తిరిగి అమెరికాకు అప్పగించేదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. దక్షిణచైనా సముద్రంలో చైనాకు హక్కులు లేవన్న అంతర్జాతీయ కోర్టు తీర్పును అంగీకరించబోనన్న డ్రాగన్‌ దేశం.. కొద్ది నెలలుగా ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తోంది. సముద్రంలో తాను తయారుచేసుకున్న ఏడు కృత్రిమ దీవుల్లో చైనా భారీ ఎత్తున ఆయుధాలను మోహరింపజేస్తోంది. వాటిలో గగనతలంలో దాడిచేయగల క్షపణులను కూడా సిద్ధంగాఉంచింది.

దక్షిణచైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన  పరిశోధక నౌక: యూఎస్‌ఎన్‌ఎస్‌-బౌదిక్‌‌ (డ్రోన్‌ను పంపింది ఈ నౌక నుంచే)

దక్షిణచైనా సముద్రంలోని ఓ కృత్రిమ దీవిలో చైనా సిద్ధం చేసుకున్న ఆయుధాలు

Advertisement
Advertisement