జీవిత ఖైదీకి డిగ్రీలో ‘గోల్డ్‌ మెడల్‌ ’

1 May, 2017 11:38 IST|Sakshi
జీవిత ఖైదీకి డిగ్రీలో ‘గోల్డ్‌ మెడల్‌ ’

► నేడు అవార్డు అందుకోనున్న యుగంధర్‌

కడప అర్బన్‌ : కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న గునకల యుగంధర్‌ (29) చదువులో సత్తా చాటాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ పాసై గోల్డ్‌ మెడల్‌ అందుకోనున్నాడు. 2013–2015 సంవత్సరాల్లో బీఏలో ఈయన 1600 మార్కులకు 1147 మార్కులు సాధిం చి, టాప్‌లో నిలిచాడు. దీంతో యూ నివర్సిటీ అధికారులు హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో సోమవారం నిర్వహించనున్న యూనివర్సిటీ 21 వ స్నాతకోత్సవంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకోనున్నాడు.

హత్యకేసులో ముద్దాయిగా...
యుగంధర్‌ది చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం. తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే సంతానం. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుకుంటుండగా ఓ హత్య కేసులో ముద్దాయి అయ్యాడు. చిత్తూరు జిల్లా కోర్టు మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు అదే సంవత్సరం ఇతనికి జీవిత ఖైదు విధించడంతో 2011లో కడప కేంద్ర కారాగారానికి శిక్ష అనుభవించేందుకు వచ్చాడు. ఇక్కడి కారాగార అధికారుల ప్రోత్సాహంతో 2013– 2015 సంవత్సరాల్లో ఓపెన్‌గా బీఏ డిగ్రీలో చేరాడు. పట్టుదలతో చదవడంతో అత్యధిక మార్కులు సాధించి, గోల్డ్‌ మెడల్‌కు ఎంపికయ్యాడు. జైలు అధికారుల ప్రోత్సాహంతోనే తనకు మెడల్‌ వచ్చిందని ఖైదీ యుగంధర్‌ ఆదివారం విలేకరులకు తెలిపాడు. ఖైదీకి గోల్డ్‌ మెడల్‌ రావడంతో తోటి ఖైదీలు, జైలు అధికారులు అభినందిస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు