ఆర్నెల్ల కింద నుంచే ‘ఆపరేషన్ నయీమ్..’!

9 Aug, 2016 03:27 IST|Sakshi
ఆర్నెల్ల కింద నుంచే ‘ఆపరేషన్ నయీమ్..’!

నయీమ్ ఆగడాలకు అడ్డుకట్టవేయాలని సర్కారు నిర్ణయం  
అతడి అనుచరులు లొంగిపోయేలా వ్యూహం
నయీమ్‌తో సంబంధాలున్న అధికారులకు వివరాలు తెలియకుండా జాగ్రత్త  
ఏదో జరుగుతోందని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నయీమ్
ఇటీవలే మళ్లీ బెదిరింపులు మొదలుపెట్టిన ముఠా  
నియోజకవర్గంలో తిరగొద్దంటూ భువనగిరి ఎమ్మెల్యేకు బెదిరింపులు
అప్రమత్తమైన పోలీసులు.. పక్షం రోజులుగా పూర్తిస్థాయి నిఘా  
ముఠా కార్యకలాపాలపై ఆధారాల సేకరణ.. ఎన్‌కౌంటర్


సాక్షి, హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే ‘ఆపరేషన్ నయీమ్’ మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా పనిపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. నయీమ్‌తో సంబంధాలున్న పోలీ సు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది.

ఈ క్రమంలో మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నయీమ్ నేరుగా బెదిరించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లి, ఆయనతోనే గొడవపడి అంతు చూస్తాననడం... నియోజకవర్గంలో తిరగొద్దంటూ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హెచ్చరించడం..మరో ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి బూతులు తిట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దీంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో భూ సెటిల్‌మెంట్లు చేయడం, భూముల యజమానులను బెదిరిం చి తక్కువ ధరకే లాక్కోవడం వంటి ఫిర్యాదులు లెక్కకు మించి వచ్చాయి. మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించడంతో నయీమ్‌ను మట్టుబెట్టాలని ప్రభుత్వం పోలీ సు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

సన్నిహితుల లొంగుబాటుతో ఛత్తీస్‌గఢ్‌కు...
భువనగిరి ప్రాంతంలో నయీమ్‌తో కలసి సెటిల్‌మెంట్లు చేసేవాళ్లను లొంగిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించడంతో నయీమ్ హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మకాం మార్చాడు. అక్కడ నక్సలైట్లను రూపుమాపేందుకు నయీమ్ ఉపయోగపడతాడని ఇక్కడి కొందరు పోలీసు అధికారులు చెప్పడంతో.. ఛత్తీస్‌గఢ్ ఉన్నతాధికారులు అతనికి ఆశ్రయమిచ్చారు. దీంతో నయీమ్ అక్కడి పోలీసు ఉన్నతాధికారుల సహాయంతో కాంట్రాక్టర్‌గా అవతారమెత్తాడు. కొన్ని పను లు కూడా చేశాడు.

తర్వాత కొన్నాళ్లకు హైదరాబాద్ చేరుకున్న నయీమ్... ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించడం, వ్యాపారులను హెచ్చరించడం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో పక్కా ఆపరేషన్‌కు పోలీసులు రూపకల్పన చేశారు.అతడి సెల్ నంబర్లు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నదీ గుర్తించారు. కొద్ది రోజులుగా షాద్‌నగర్-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. రెండు ప్రాంతాల్లోని నయీమ్ ఇళ్లపై వారంగా నిఘా పెట్టారు. అతడి కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఆధారాలను పూర్తిస్థాయిలో కనిపెట్టేందుకు ఆదివారం నుంచే రహస్యంగా వెంబడించడం ప్రారంభించారు. అయితే సోమవారం పోలీ సుల కదలికలను గుర్తించిన నయీమ్ కాల్పులకు దిగాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నయీమ్ హతమయ్యాడు.
 
ఎమ్మెల్యేకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం
సాధారణంగా అయితే ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు జెడ్ కేటగిరీలో ఉన్న వాళ్లకే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సమకూరుస్తారు. కానీ నయీమ్ బెదిరింపుల నేపథ్యంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి పోలీసు శాఖ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చడంతో పాటు భద్రత ఏర్పాటు చేసింది. ‘‘నయీమ్, అతడి ముఠా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నదీ, ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నదీ తెలిసింది.

అధికార పార్టీలో కొందరితో సంబంధాలు పెట్టుకుని వారి కోసం సెటిల్‌మెంట్లు చేసినట్లు తేలింది. కొందరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, వ్యాపారంలో వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాలని మరికొందరిని బెదిరించడం వంటివి మా దృష్టికి వచ్చాయి. కొందరు పోలీసు అధికారులతోనూ అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. దాంతో నయీమ్‌ను పట్టుకునేందుకు రహస్యంగా ఆపరేషన్ చేపట్టాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

మరిన్ని వార్తలు