నయీమ్ X సాంబశివుడు | Sakshi
Sakshi News home page

నయీమ్ X సాంబశివుడు

Published Tue, Aug 9 2016 3:35 AM

నయీమ్ X సాంబశివుడు - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాంబశివుడు, నయీమ్.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఈ ఇద్దరు మాజీ మావోయిస్టుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచింది. సైద్ధాం తికంగా వచ్చిన విభేదాలు వ్యక్తిగతంగా మారి ఒకరినొకరు చంపుకొనేందుకు ప్రయత్నించేదాకా వెళ్లింది. ఇద్దరిదీ పీపుల్స్‌వార్ నేపథ్యమే అయినా చెరోదారి పట్టారు. సాంబశివుడు మావోయిస్టు పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్లగా.. నయీమ్ పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చాక గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకొనేందుకు చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. చివరకు సాంబశివుడిని, ఆయన సోదరుడు రాములును నయీమ్ ముఠా హత్య చేయగా.. నయీమ్ ఇప్పుడు పోలీసుల చేతిలో హతమయ్యాడు.
 
బయటకు వచ్చిన తర్వాత..
సాంబశివుడి కంటే ముందే నయీమ్ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లాడు. యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబుదాడి చేసిన తర్వాత జైలుకు వెళ్లాడు. అక్కడ పీపుల్స్‌వార్ అగ్రనేతలతో ఏర్పడిన పరిచయం ఆయనను కీలకంగా మార్చింది. అయితే తర్వాత పార్టీతో విభేదించిన నయీమ్ బయటకు వచ్చేశాడు. నయీమ్ తర్వాత పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన సాంబశివుడు ఆ పార్టీలో చాలా ఎదిగారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో, మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో గుర్తింపు పొందాడు. తర్వాత వ్యక్తిగత కారణాల రీత్యా మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలం అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. తర్వాత ఆయన కూడా సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలున్నాయి. సాంబశివుడు పార్టీలో ఉన్నప్పుడే నయీమ్‌తో విభేదాలు వచ్చాయి. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడం, ఒకరిది మావోయిస్టు అనుకూల, మరొకరిది వ్యతిరేక సిద్ధాంతం కావడంతో విభేదాలు పెరిగాయి.
 
నయీం అనుచరులనూ మట్టుబెట్టాలి:
సాంబశివుడు తండ్రి
వలిగొండ: నయూంను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం హర్షణీయమని అతని చేతిలో హత్యకు గురైన సాంబశివుడు, రాములుల తండ్రి చంద్రయ్య పేర్కొన్నా రు. ఉద్యమ బాట వీడి ప్రజాసేవ చేయడానికి వచ్చిన తన ఇద్దరు కుమారులను నయీమ్ పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నయీమ్ అనుచరులను కూడా మట్టుబెట్టాలని పేర్కొన్నారు.
 
కోబ్రాల పేరిట పాములు

సాంబశివుడిపై ఉన్న పగను నయీమ్ అనేకసార్లు బయటపెట్టాడు. బ్లాక్ కోబ్రాల పేరిట సాంబశివుడి తల్లిదండ్రులు నివాసముండే ఇంటి ముందు త్రాచు పాములు వదిలిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సాంబశివుడిని, మావోయిస్టులను చంపుతానని నయీమ్ అనేకసార్లు ప్రకటించాడు. సాంబశివుడి తల్లిదండ్రులను బెదిరించారని అప్పట్లోనే వారు ఆరోపించారు.ఇక నయీమ్ హత్యకు మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడే సాంబ శివుడు ప్లాన్ వేశాడు. నయీమ్ కోసం ప్రత్యేకంగా గెరిల్లా స్క్వాడ్‌ను రంగంలోకి దింపినా ఫలితం సాధించలేకపోయాడు. కానీ సాంబశివుడు, ఆయన సోదరుడు రాములును నయీమ్ పక్కా ప్లాన్ వేసి హత్య చేయించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement