సీసీ కెమెరా.. కాల్‌డేటా సాయంతో...

18 Jun, 2016 23:35 IST|Sakshi

శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం జాతీయ రహదారిపై ఈ నెల 10న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ తన బంగ్లాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సింగుపురం వద్ద ఈ నెల 10న గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామం చిన్నవీధికి చెందిన పిన్నింటి సూరయ్య(70) మృతి చెందినట్టు చెప్పారు.
 
  దీనికి కారణమైన సోంపేటకు చెందిన చర్చి ఫాస్టర్ బి.సూర్యాకాంత్ పాణిగ్రహిని సీసీ కెమెరా, కాల్ డేటా సాయంతో ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసును నీరుగార్చేందుకు సహకరించిన ఓ సీఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించామని, కేసు దర్యాప్తును సరిగా చేయనందుకు శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ మధుసూదనరావును వీఆర్‌కు పంపినట్టు చెప్పారు. అనుకోని ప్రమాదాలు జరిగిన సమయంలో 108 లేదా 100కు సమాచారాన్ని అందజేయూలని ఎస్పీ కోరారు.
 
 చర్చి ఫాస్టర్ ఏమన్నారంటే...
 శ్రీకాకుళం కిమ్స్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌కు ఈ నెల 10వ తేదీన ఎనిమిది మందితో కలిసి టాటా సుమో వాహనంపై సోంపేట నుంచి వచ్చామని, సింగుపురం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అనుకోకుండా ఢీకొట్టామని అంగీకరించారు. అక్కడ నుంచి భయంతో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయూమని చర్చి ఫాస్టర్ బి. సూర్యాకాంత్ పాణిగ్రహి విలేకరులకు వెల్లడించారు.
 
 పోలీసుల ఆరా...
  ఎస్పీగా బ్రహ్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ కె.భార్గవరావునాయుడు మాట్లాడుతూ ఓ తెల్లటి సుమో వాహనం సింగుపురం వద్ద ఓ వ్యక్తిని ఢీకొని పరారైనట్లు స్థానికులు తెలిపారని చెప్పారు. ఆ వాహనం కిమ్స్ వద్ద ఉన్నట్లు సమాచారం రాగా ఆ వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు. అయితే టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరాల పుటేజిని పరిశీలించగా ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తి తెల్లటి వస్త్రాలు ధరించినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఫాస్టర్ సూర్యాకాంత్ వాహనాన్ని డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్‌కు కారణం కాగా సంబంధం లేని డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించారన్నాని చెప్పారు. ఫాస్టర్ కాల్‌డేటాను పరిశీలించగా ప్రమాదం జరిగిన రోజున రాత్రి ఓ సీఐతో మూడు గంటల పాటు మాట్లాడినట్లు గుర్తించామని దీని ఆధారంగానే కేసును చేధించామని తెలిపారు.
 
  డీఎస్పీ, సీఐలకు అభినందనలు
 ఈ కేసును పకడ్బందీగా చేధించినందుకుగాను శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, సీఐ అప్పలనాయుడుకు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అభినందించారు.
 

మరిన్ని వార్తలు