మానస...మనోజ్ అయ్యాడు..

24 May, 2016 08:51 IST|Sakshi
మానస...మనోజ్ అయ్యాడు..

కామారెడ్డి : తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మిదేవత ఇంటికి వచ్చిందని మురిసిపోయారు. చూడచక్కగా ఉన్న పాపకు మానస పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏడాది.. రెండేళ్లు.. మూడేళ్లు..పదేళ్లు గడిచాయి. అంతలోనే మానసకు కడుపులో నొప్పి రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు డాక్టర్ల వద్ద చూపించారు. రకరకాల పరీక్షలు, స్కానింగ్‌ తరువాత ఆమెలో మగ లక్షణాలున్నాయని తేల్చారు. గర్భాశయం, అండాశయం లేవని నిర్ధారించారు. పురుషాంగాలు లోపల ఉన్నాయని, ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు డబ్బు చాలానే ఖర్చవుతుందన్నారు.

దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి ఈ నెల 9న  కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌లోని పీపుల్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్‌ చేసిన వైద్యులు కడుపు లోపలి భాగంలో ఉన్న వృషణాలను బయటకు తీసి సరిచేశారు. ఇది అరుదైన ఘటనగా చెప్పారు. మానస పేరును మనోజ్‌గా మార్చేశారు. ఇప్పుడు మనోజ్‌గా కొత్త జీవితం మొదలైంది. మెదక్‌ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య దంపతులు కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లో 20 ఏళ్లుగా నివసిస్తారు. రాజు బీడీ కంపెనీలో పనిచేస్తుండగా, లావణ్య బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. వారికి  2005 జూన్‌ 26న మానస జన్మించింది. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లోని వాగ్దేవి పాఠశాలలో మానస చదువుతోంది. గత యేడాది 4వ తరగతి చదివింది.

ఏడాదిగా సంఘర్షణ...

మానస ఆడపిల్ల కాదని తెలిసిన నాటి నుంచి తల్లిదండ్రులు ఎంతో సంఘర్షణకు లోనయ్యా రు. తమ కూతురి సమస్య ఎలా పరిష్కారమవుతుందోనని ఆ తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. కూతురిని వెంటబెట్టుకుని ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. బీడీలపైనే ఆధారపడ్డ ఆ దంపతులు కూతురిని కాపాడుకునేందుకు అప్పు లు చేసి మరీ ప్రయత్నాలు చేశారు.  ఎలాగోలా ఆపరేషన్‌ చేయించారు. ఏడాది కాలం గా పడ్డ సంఘర్షణకు తెరపడడంతో కొంత  ఊపిరి పీల్చుకున్నారు. కాని మరో మూడు నెలలకు మరో ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పిన మీదట మరిన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనేది ఆ తల్లిదండ్రులకు తీవ్ర సమస్యగా మారింది.

ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం

బీడీ కంపెనీలో పనిచేసే రాజు, బీడీలు చుట్టే లావణ్యల సంపాదన సంసారానికే సరిపోతుంది. అయితే తమ కూతురి సమస్యతో ఇబ్బందులు పడ్డ రాజు, లావణ్యలు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏడాదిపాటు తిరగడానికి, వైద్యానికి రూ. లక్షన్నర అప్పు చేశారు. చేసిన అప్పు తీర్చడం ఒక ఎత్తయితే, మరో ఆపరేషన్‌కు కావలసిన డబ్బులు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి భారంగా మారాయి. తమకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు