ఇల్లే బడి..తల్లే గురువు!

18 Sep, 2017 11:34 IST|Sakshi
ప్రత్యేక అవసరాల పిల్లలు

ప్రత్యేక అవసరాల పిల్లల నైపుణ్యం గుర్తించడం కీలకం
బాధ్యతతో చేరదీస్తే అద్భుత ఫలితాలు
తల్లిదండ్రులే పిల్లల శిక్షకులు


వైకల్యం.. శాపమా..? కానేకాదంటున్నారు వైద్యులు, నిపుణులు. కాసింత ఆదరణ చూపి, చేరదీస్తే వారికంటే అద్భుత ఫలితాలు సాధించగలిగే వారు ఎవరూ ఉండరని చెబుతున్నారు. ఇల్లే బడిగా మారి తల్లే గురువుగా బోధిస్తే వారి కంటే మంచి విద్యార్థులను చూడలేమని అంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యేక అవసరాల పిల్లల్లో ప్రత్యేకమైన లక్షణాలు, నైపుణ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి ప్రోత్సహించగలిగితే దివ్యాంగులు కూడా అందరు పిల్లల్లాగానే ఎదుగుతారని చెబుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం పాఠశాలలు నడుపుతున్నట్లుగానే తాజాగా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఎచ్చెర్ల క్యాంపస్‌:
వైకల్యం ఉన్న పిల్లలపై జాలి చూపిస్తే ఏమొస్తుంది.. కాసిన్ని కన్నీళ్లు తప్ప ఇంకేమీ రావు. వారిలో అంతర్గత నైపుణ్యాలను వెలికితీయగలిగితే అద్భుతాలు సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. అయితే ఈ బడుల్లో కంటే తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు ఎక్కువ కాలం గడుపుతారు. దీంతో తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో న్యూఢిల్లీకి చెందిన సంస్థ రీహేబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సహిత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు ఈ నెల 11 నుంచి 15 వరకు శిక్షణ నిర్వహించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.

గుర్తింపే ముఖ్యం
ప్రత్యేక అవసరాల పిల్లలను విభిన్న శక్తి ప్రతిభ సామర్థ్యాలు ఉన్న పిల్లలుగా గుర్తించాలి. మానసిక వైకల్యం గురించి మర్చిపోవాలి. వారిలో సామర్థ్యాన్ని గుర్తించాలి. వినికిడి లోపం పిల్లల్లో ఆటలు ఆడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. చిత్రలేఖనంలో రాణించగలరు. దృష్టిలోపం ఉన్నవారు మంచి పాటలు పాడగలరు, సమర్థమైన బోధన చేయగలరు. మూగ విద్యార్థుల్లో సైతం క్రీడా రంగంలో రాణించే ప్రతిభ ఉంటుంది. మానసిక వికలాంగుల్లో సైతం కొన్ని సామర్థ్యాలు అంతర్లీనంగా ఉంటాయి. అయితే జీవన నైపుణ్యం, వృత్తి నైపుణ్యం, ఫిజియోథెరపీ, రోజువారీ కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించాలి.

పెంపకమే ప్రధానం
బాల్యం నుంచి ప్రత్యేక అవసరాల పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారి దినచర్యలు వారు నిర్వర్తించటం, నచ్చిన రంగాల్లో నైపుణ్యం సాధించేలా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించటం, సైగలు, గు ర్తులు చూపటంలో భావవ్యక్తీకరణ అలవాటు చేయటం, మానసికంగా బలంగా ఉండేటట్లు తీర్చిదిద్దటం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉం టుంది. అలాగే పిల్లల్లో మానసిక వైకల్యం పరిస్థితిని బట్టి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అతి తీవ్ర, తీవ్ర, మాధ్యమిక, స్వల్ప, అతి సామాన్య ఇలా అనేక రకాలుగా పిల్లల్లో మానసిక వైకల్యం ఉంటుంది. పిల్లల వైకల్యం శాతం ఆధారంగా శిక్షణ అవసరమవుతుంది.

పిల్లల్లో ఆత్మస్థైర్యం ముఖ్యం
పిల్లల్లో ఆత్మస్థైర్యం కీలకం. సమాజంలో ఈ పిల్లలను ప్రత్యేకంగా చూడనవసరం లేదు. వారిలో ఉన్న సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు ఈ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. తప్పకుండా వారిలో మార్పు ఉం టుంది. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటారు. పిల్లలను తక్కువ చేసి చూ డటం వల్ల మానసిక సంఘర్షణకు గురవుతారు.
– జి.కేశవరావు, సహితపాఠశాల ఉపాధ్యాయులు

అంతర్గత శక్తి గుర్తించాలి
ప్రత్యేక అవసరాల పిల్లల్లో సైతం అంతర్గత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించాలి. వారిని ఎప్పుడూ కించపరచకూడదు. అనుకూల దృక్పథం నిరంతరం నూరి పోయాలి. త ప్పకుండా వారిలో మార్పు వస్తుంది. త ల్లిదండ్రులు పిల్లల పెంపకంలో నిపుణుల సూచనలు పాటించాలి. పలు రంగాల్లో రాణిస్తున్న ప్రత్యేక వ్యక్తుల గురించి చెప్పాలి.
– శ్రీధర్, సహిత పాఠశాల, ఉపాధ్యాయుడు

తల్లిదండ్రులే కీలకం
ప్రత్యేక అవసరాల పిల్లలను తీర్చి దిద్దటంలో తల్లిదండ్రులే కీలకం. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ, బాధ్యత ఉండాలి. ఎప్పుడూ పిల్లల్లో ని రాశ, నిస్పృహలు ఉండకూడదు. తల్లిదండ్రులు వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించాలి.  
– కె.ధనుంజయ, సహిత పాఠశాల, ఉపాధ్యాయుడు

మరిన్ని వార్తలు