ప్రపంచానికే ఆదర్శంగా వాటర్‌గ్రిడ్

7 Oct, 2015 02:28 IST|Sakshi
ప్రపంచానికే ఆదర్శంగా వాటర్‌గ్రిడ్

అక్రమాలకు తావివ్వకుండా చూస్తున్నాం: కేటీఆర్
♦ తెలంగాణకు భవిష్యత్తులో తాగునీటి కష్టాలుండవు
♦ అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని వెల్లడి
♦ 18ఏళ్ల క్రితమే సిద్ధిపేటలో ఇంటింటికీ నీరివ్వడమే దీనికి ఆదర్శం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఓ ఆదర్శ పథకంగా నిలిచిపోయేలా వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మిస్తుండడం సాహసోపేతమని... నీటి కోసం పాలమూరు కష్టాలు, నల్లగొండకు ఫ్లోరైడ్ బాధలు భవిష్యత్తులో ఉండవని చెప్పారు. మంగళవారం శాసనసభలో వాటర్‌గ్రిడ్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రూపొందిన నీటి పథకాలను వాటర్‌గ్రిడ్‌తో అనుసంధానిస్తున్నామని చెప్పారు.

నల్లగొండలో పరిస్థితి మారకుంటే మానవ రహిత ప్రాంతంగా మారుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 18 ఏళ్ల కింద సిద్ధిపేటలో ఇంటింటికి తాగునీటిని అందించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు రాష్ట్రమంతటా దాన్ని విస్తరించే క్రమంలో రూ.36 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును ప్రారంభించారని వెల్లడించారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసేలా 26 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి దానికి కాలపరిమితి విధిస్తున్నామని తెలిపారు. అవినీతికి తావులేకుండా ఈపీసీ విధానానికి స్వస్తి చెప్పామని... ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకే అన్నిరకాల బాధ్యతలు అప్పగించే విధానాన్ని నిలిపివేశామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యయన బాధ్యతతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను వ్యా ప్కోస్‌కు అప్పగించామన్నారు. ఇప్పటికే 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లిస్తున్నందున ఈ ప్రాజెక్టు అవసరమే లేదని కొందరు అంటున్నారని... 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు అందుతున్న విషయం వాస్తవమైతే తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్నారు.

 వినియోగదారులపై భారం మోపుతారా?
 వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు వినియోగించే విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందా, వినియోగదారులపై మోపుతారా అని అధికారపార్టీ సభ్యుడు గంగుల కమలాకర్ ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటి సేకరణ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించే సమావేశాలకు ఎమ్మెల్యేలను పిలవాలని మరో సభ్యుడు కిషోర్ కోరారు. గతంలో ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవమున్న తనలాంటి వారి సేవలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టు గుజరాత్‌లో అమలవుతున్నందున అక్కడ పనిచేసిన రిటైర్డ్ అధికారుల సేవలు తీసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌తో కూడా అనుసంధానించాలని మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్ కోరారు.

మరిన్ని వార్తలు