మీకు దయలేదు !

30 Jun, 2017 02:56 IST|Sakshi
మీకు దయలేదు !

► బ్యాంకర్ల తీరుపై మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం
► రైతుల నుంచి 4 శాతం వడ్డీ ఎందుకు వసూలు చేస్తున్నారు
►  ఆ డబ్బులు ప్రభుత్వమే కడుతుంది.... వెంటనే తిరిగి ఇచ్చేయండి
► రూ.1600 కోట్లు ఇచ్చినా రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమచేయలేదు
► పైగా ప్రభుత్వాన్ని బదనామ్‌  చేస్తున్నారు
► నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం


ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌) : రైతు సంక్షేమాన్ని కోరి రుణ మాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తల తాకట్టు పెట్టి మరీ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 16 వేల కోట్లు తెచ్చింది. జిల్లాలో రూ. 1600 కోట్లు  బ్యాంకర్లకు ఇస్తే వాటిని సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ఇటు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి 4 శాతం వడ్డీని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు ఎందుకని, ప్రభుత్వం మీ డబ్బులు కట్టకుండా పారిపోతుందా...? ఇది భావ్యమా..? అసలు మీకు దయ అనేది లేదు... అంటూ బ్యాంకర్ల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.

గురువారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ ఇన్‌పుడ్‌ సబ్సిడీ విషయంలో కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమచేయడం లేదని బ్యాంకర్లపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు లేవని ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దని అన్నారు. లోపాలను సవరించుకుని ముందుకు పోవాలని బాధ్యతగా పనిచేస్తే ఫలితం ఉంటుందన్నారు. విడుదల చేసిన జిల్లా 2017–18 వార్షిక ప్రణాళిక రూ.4619 కోట్ల ప్రణాళికలో అత్యధికంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు 50 శాతం కంటే ఎక్కువగా కేటాయించామని , క్రాప్‌లోన్‌ లక్ష్యం రూ.2409 కోట్లు నిర్ణయించామన్నారు. ఈ వార్షిక ప్రణాళిక లక్ష్యాన్ని గడువులోగా పూర్తిచేయాలని కోరారు.

గత ఏడాది ప్రణాళికలో మొత్తం రూ.3931 కోట్లు కాగా 80 శాతం లక్ష్యంతో రూ.3140 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిన మంత్రి గత ఏడాది రుణాలు ఇవ్వడంలో కొన్ని బ్యాంకులు వెనుకబడ్డాయన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్నాయని పంటలసాగు బాగుందని, ఈ నేపథ్యంలో పంటల బీమా విషయంలో రైతులకు అవగాహనకల్పించి క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి అందరితో సహకాలంలో ప్రీమియం కట్టించాలన్నారు. ఇందుకు ప్రచారం కోసం గ్రామాల్లో ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంపై ప్రచారం నిర్వహించేందుకు ప్రచార రథాలను తింపాలన్నారు.

రైతు రుణాల వడ్డీ బకాయి రూ.271 కోట్లు విడుదల చేశామని, బ్యాంకులు చేస్తున్న తప్పులకు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. అదే విధంగా నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్సు టీమ్‌లను వేశామని తెలిపిన మంత్రి అలాంటి నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీయాక్ట్‌లు బుక్‌చేసి లైసెన్స్‌లు రద్దుచేయడమే కాకుండా కటకటలాపాలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ మాట్లాడుతూ రైతులకు రుణాలను సకాలంలో అందించాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌రాజు, జిల్లా కలెక్టర్‌ యోగితారాణా, బోధన్‌ సబ్‌కలెక్టర్‌ సిక్తాపట్నాయక్, ఎల్‌డీఎం సురే‹శ్‌రెడ్డి, బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు