తప్పు తప్పే.. పెద్ద తప్పే..

8 Aug, 2017 22:54 IST|Sakshi
తప్పు తప్పే.. పెద్ద తప్పే..
ముక్కంటి మన్నించు!
పాదగయ క్షేత్రంలో అపచారం నిజమే
ఒప్పుకున్న అర్చకులు
ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకమండలి 
కుక్కుటేశ్వరుడినికి ప్రాయశ్చిత పూజలు
పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ కుక్కుటేశ్వరస్వామి వారి దేవాలయంలో వందేళ్ల సంప్రదాయాన్ని పాటించకుండా అపచారం చేశామని ఆలయ అధికారులు అర్చకులు ఒప్పుకున్నారు. అపచారం ప్రక్షాళన కోసం స్వామివారికి సంప్రోక్షణ, ప్రాయశ్చిత పూజలు నిర్వహించారు. ‘పాదగయ క్షేత్రంలో అపచారం’ అనే శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో మంగళవారం ప్రచురితమైన వార్తకు ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌ కొండేపూడి ప్రకాష్‌ అధ్యక్షతన ఆలయ వేదపండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ మంగళవారం ఆలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జరిగిన అపచారంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని అర్చకుల తరఫున అధికారులకు హామీ ఇచ్చారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆలయంలో గ్రహణం రోజున  స్వామివారికి పట్టు స్నానం చేయించి అనంతరం అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేశంలో అన్ని ఆలయాలు గ్రహణం సందర్భంగా మూసివేసినా కాళహస్తి ఆలయంతో పాటు ఈ ఆలయం మాత్రం తెరిచి ఉంచి గ్రహణం ఉన్నంత సేపు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాల్సి ఉందన్నారు. గ్రహణం పూర్తయిన అనంతరం విడుపు స్నానం చేయించి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాల్సి ఉందన్నారు. అయితే ఆలయ అర్చకులు ఈ విషయాన్ని అనివార్య కారణాల వల్ల పట్టించుకోలేదన్నారు. జరిగిన అపచారానికి చింతిస్తున్నామని, స్వామివారికి ప్రాయశ్చితపూజలు సంప్రోక్షణలు నిర్వహించామన్నారు. ఆలయ ఈఓ చందక దారబాబు జరిగిన అపచారానికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానన్నారు. ఆలయ అర్చకులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సి ఉందని వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆలయ ట్రస్టుబోర్టు చైర్మన్‌ కొండేపూడి ప్రకాష్‌ మాట్లాడుతూ పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలపడం దారుణమన్నారు. ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. 
మరిన్ని వార్తలు