అభివృద్ధి కోసమే.. పదవి

15 Jul, 2016 04:10 IST|Sakshi
అభివృద్ధి కోసమే.. పదవి

అందుబాటులో ఉంటూ.. అభివృద్ధి చేస్తున్నా..
నిత్యం ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నా..
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
ఎదురుదాడే మంత్రంగా పని చేస్తున్నా..
సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే

 ‘ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. వారి మనిషిగా ఉండటమే నాకిష్టం. జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతూ.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అందించేందుకు నా పదవిని ఉపయోగించటం తృప్తినిచ్చే అంశం. తెలంగాణ వాదానికి ముడిపెట్టి రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం.. నిరుపేదలు ఆర్థిక, సామాజిక అభివృద్ధి పథంలో పయనించేందుకు నా పదవిని ఉపయోగిస్తా’. అంటూ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 సత్తుపల్లి : శిలాఫలకాలు.. రోడ్లు వేయడమే అభివృద్ధి కాదు.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. అండగా నిలవడమంటే నాకిష్టం.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన.. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయించడం నా కర్తవ్యం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సింది ప్రభుత్వం.. తద్వారా ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రతిపక్షమైన అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’. అని రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 ప్రభుత్వ రెండేళ్ల పాలనపై..ప్రభుత్వం ఒకటి రెండు కార్యక్రమాల చుట్టే తిరుగు తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ జపం చేస్తూ.. కొత్త పనులు చేపట్టడం వదిలేసింది. చాలా పథకాల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజలం దరినీ తమవైపు తిప్పుతూ.. అటుచేసి ఇటుచేసి రెండేళ్లు గడిపేసింది. ఎస్టిమేషన్ ఒకటి.. టెండర్ ఒకటి.. ఎక్స్‌టెన్షన్ మరొకటి.. ఇలా ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచి పెడుతోంది. కోట్ల రూపాయల పనులు నామినేషన్లపై ఇచ్చేస్తున్నారు. మిషన్ కాకతీయ పనులు 40 శాతం లెస్ వేసినా.. కాంట్రాక్టర్లకు లాభం వస్తుందంటే అంచనాల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరగటం విచారకరం. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పండుగలకు భోజనాలు పెట్టడం కాదు.. ఆ వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన పనులు చేపడితే ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

 ప్రజాప్రతినిధిగా మీ అనుభవం?
ఇప్పటికి నేను మూడోసారి ఎమ్మెల్యేగా పని చేస్తున్నాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మూడు ప్రభుత్వాలను దగ్గర నుంచి చూశాను. ప్రజా సమస్యలను ఆరుగురు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లా.. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంచి గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు పిలిచేందుకు జంకే పరిస్థితి వచ్చింది. ఈ పద్ధతిలో మార్పు రావాలి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం అధికారులను కలవటం.. పని చేయించటం నా హక్కు. దారిని హరించే ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్లి ప్రజల కోసం పోరాటం చేస్తా. మహిళలు, ఎస్సీలు కేబినెట్‌లో లేని ప్రభుత్వాన్ని చూడటం ఇదే తొలిసారి.

 ఎమ్మెల్యే నిధులెలా ఖర్చు చేశారు?
రెండేళ్లలో నాకు వచ్చిన రూ.4కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. మరికొన్ని పనులు పూర్తి చేశాం.. శాశ్వతంగా నిలిచే పనులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాను. సత్తుపల్లిలో ముస్లిం ఈద్గాకు బోరు వేయించటం, మట్టి తోలించటం, జామె మసీద్‌కు రూ.50వేలు, షాదీఖానాకు రూ.3లక్షలు కేటాయించాను. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించాను.

 పెండింగ్ పనులపై..
ప్రభుత్వాలు మారగానే ప్రాధాన్యత మారటం బాధాకరం. రూ.38కోట్లతో సత్తుపల్లిలో 24 గంటలు మంచినీరు సరఫరా చేసే పథకం మిషన్ భగీరథలో చేర్చకపోవటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ పనులను సాగదీయకుండా.. నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేయాలి. పది వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిల్లుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిరుపేదలను ఇబ్బం దులు పెట్టడం సరికాదు. డబుల్ బెడ్‌రూం పథకానికి ఇప్పటివరకు కనీస మార్గదర్శకాలు రాలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై చట్టం చేసినా దారి మళ్లిస్తున్నారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి కొత్తగా భవనం నిర్మించాలి. పెనుబల్లి, కల్లూరు ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలి. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సీట్లు పెంచాలి. నియోజకవర్గంలో సుమారు 6వేల మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా.

 టీటీడీ పాలక మండలి సభ్యుడిగా..
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని హిందూ దేవాలయాల అభివృద్ధికి ఆర్థికంగా చేయూతనందిస్తున్నాను. అనువైన ప్రాంతాల్లో కల్యాణ మండపాలు, పురాతన దేవాలయాల అభివృద్ధి, గోశాల ఏర్పాటుకు నిధులు అందించాను. ఎంతో మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు నా వంతు సహకారం అందిస్తున్నా. తిరుపతి ఆస్పత్రిలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 150 మందికి రూ.1.50లక్షలు ఖర్చయ్యే మోకాళ్ల ఆపరేషన్లు ఉచితంగా చేయించాను.

>
మరిన్ని వార్తలు