‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి | Sakshi
Sakshi News home page

‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి

Published Fri, Jul 15 2016 4:06 AM

‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల పనుల్ని టీడీపీ నేతలు దోపిడీకి ఆయుధంగా మలుచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. వందల కోట్ల పుష్కరాల నిధుల దోపిడీకోసం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ పనుల్ని నామినేషన్ విధానంలో కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలలో దోపిడీ విధానమంతా సీఎం కార్యాలయం ప్రమేయంతోనే జరుగుతోందని ఆరోపించారు.

పరిపాలన అనుమతులు లేకుండానే పనులు చేపట్టి.. ఆ తర్వాత అనుమతులివ్వడంలో ఆంతర్యమేంటన్నారు. రూ.35 కోట్ల విలువైన పనుల్ని ఎలా అనుమతించారో చెప్పాలన్నారు. నిబంధనల ప్రకారం వెళతామన్న అధికారులపై సీఎం కన్నెర్ర చేస్తూ కర్రపెత్తనం చేస్తున్నారని విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు నిధుల విడుదల దగ్గర్నుంచీ టెండర్ల వ్యవహారం, పనుల కేటాయింపుపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సాగునీటిశాఖ మంత్రి నివాసముండే ప్రాంతానికి కూతవేటు దూరంలోని అత్యంత ప్రాముఖ్యమైన దుర్గాఘాట్ పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు.
 
ఆ కమిషన్ చంద్రబాబును విచారించిందా?
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారార్భాటానికి 30 మంది బలయ్యారని, ఈ దుర్ఘటన జరిగి ఏడాదైనా ప్రజల మదినుంచి తొలగిపోలేదని పార్థసారథి అన్నారు. అసలు తొక్కిసలాటకు బాధ్యుడైన చంద్రబాబును సోమయాజులు కమిషన్ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. కమిషన్ గడువు గతనెల 29నాటికి పూర్తై చంద్రబాబును ప్రశ్నించలేదంటే.. వారిచ్చే నివేదికెలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో 30మందిని బలి తీసుకుంటే, కృష్ణా పుష్కరాలకు 30 గుళ్లు కూల్చేశారన్నారు.

Advertisement
Advertisement