జలహారతి ప్రచార ఆర్భాటమే

8 Sep, 2017 07:39 IST|Sakshi
జలహారతి ప్రచార ఆర్భాటమే

హంద్రీనీవా ఆయకట్టుకు ఈ ఏడాదైనా నీరివ్వాలి
మూడేళ్లలో ఒక్క ఎకరానూ తడపని దౌర్భాగ్యం
సీమను సస్యశ్యామలం చేస్తామని సీఎం గొప్పలు
ఉరవకొండ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌
ఫ్యాక్స్‌ ద్వారా సీఎం దృష్టికి జిల్లా సమస్యలు


అనంతపురం సెంట్రల్‌:
కృష్ణా, గోదావరి పుష్కరాల సందర్భంగా జలహారతులు ఇవ్వడం ఆనవాయితీ అని..  శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీళ్లు లేకున్నా ఆర్భాటం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.6,500 కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశను 95శాతం, రెండవ దశ పనులను 75శాతం పూర్తి చేశారన్నారు. ఫలితంగానే గత ఐదు సంవత్సరాలుగా హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీళ్లొస్తున్నాయని తెలిపారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయిన ఒక్క ఎకరానూ తడపలేని దౌర్భాగ్య స్థితి నెలకొందన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, అసెంబ్లీలోనూ గళం వినిపిస్తే 2016 ఆగస్టుకు నీళ్లు విడుదల చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2017 ఆగస్టు పూర్తయినా ఆ ఊసే కరువయిందన్నారు. ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను కూడా నిర్మించిన పాపన పోలేదని మండిపడ్డారు. గతేడాది రూ. 350 కోట్ల విద్యుత్‌ చార్జీలు చెల్లించి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకొస్తే రూ.3కోట్ల పంట కూడా పండించలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 20వేల ఎకరాలకు డ్రిప్‌ ద్వారా నీరు ఇస్తామని చెబుతున్నారని.. హంద్రీనీవా ఆయకట్టును ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. ఆయకట్టును రద్దు చేస్తే రైతులు తిరగబడక తప్పదని హెచ్చరించారు.

సీమపై చిత్తశుద్ధి కరువు
రాయలసీమ ప్రాంత అభివృద్ధి, రైతాంగ సంక్షేమం విషయంలో చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదన్నారు. 2004కు ముందు హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసి కిలోమీటరు కాలువ కూడా తవ్వలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 100 టీఎంసీలు నిల్వ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పారన్నారు. గతేడాది 790 అడుగుల వరకు కూడా నీటిని వదల్లేదన్నారు. 1996లో జీఓ నెంబర్‌ 69 విడుదల చేసి శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చని నిర్ణయించిన ఘనత సీఎందని వివరించారు. ప్రస్తుతం జలహారతి కార్యక్రమం ద్వారానైనా జీఓలు మార్చాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలంలో 850 అడుగుల వరకే నీళ్లు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణ జరుగుతుందని సూచించారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుకు నిఖర కేటాయింపులు చేయాలన్నారు.

ఉరవకొండ ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి
ఉరవకొండలో నిరుపేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో 2008లో 89 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. రూ.కోటి రూపాయలు వెచ్చించి స్థలాన్ని సేకరించారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా ఒక్క ఇళ్లు పట్టా మంజూరు చేయలేదన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఉవరకొండను మున్సిపాలిటీ చేయకపోవడం వల్ల అభివృద్ధి అట్టడుగున ఉండిపోయిందన్నారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులతో పాటు ప్రతినెలా సబ్సిడీపై పట్టుదారాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్యాక్స్‌ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు