సినిమా టికెట్‌ ధరలకు రెక్కలు

2 Sep, 2016 00:35 IST|Sakshi
వరంగల్‌ బిజినెస్‌ : సినిమా థియేటర్లలో టికెట్‌ ధరలకు రెక్కలొచ్చాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజీ సినిమా గురువారం విడుదల కాగా నగరంలోని పలు థియేటర్లలో టికెట్ల ధరలు పెంచారు.
 
వరంగల్‌లోని రామ్, నటరాజ్, సునీల్, లక్ష్మణ్, హన్మకొండలోని అమృత, అశోక థియేటర్లలో రూ.60 ఉన్న టికెట్‌ ఏకంగా రూ.100కు, రూ.40 ఉన్న టికెట్‌ను రూ.60, రూ.20 ఉన్న టికెట్‌ను రూ.30కు పెంచారు. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఇష్టారాజ్యంగా టికెట్‌ ధరలను పెంచడంతో సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేకుండా పోతోంది. టికెట్‌ ధరలు పెంచాలంటే జేసీ అనుమతి తీసుకోవాల్సి ఉండగా యాజమన్యాలు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాకే టికెట్ల ధరలు పెంచినట్లు చెబుతున్నారని పలువురు వాపోయారు. కాగా, సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు అధిక మొత్తం వెచ్చించడంతో టికెట్ల ధరలు పెంచినట్లు చెప్పారని సమాచారం. అయితే, వరంగల్‌ వెంకట్రామ థియేటర్‌లో కూడా టికెట్‌ ధర పెంచాలని డిస్ట్రిబ్యూటర్‌ ఒత్తిడి తెచ్చినా యజమాని నిరాకరించడంతో పాత ధరలతో విక్రయించారు. 
మరిన్ని వార్తలు