నా కలలోనూ ముచ్చుమర్రే...!

2 Jan, 2017 21:56 IST|Sakshi
నా కలలోనూ ముచ్చుమర్రే...!
గెలిచినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేను
– ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు
– గుండ్రేవుల అవసరమా? అలోచిద్దామని వ్యాఖ్య
– జిల్లాలో ముఠా తగాదాలున్నాయని మండిపాటు
– రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో 21వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ రోజూ నా కలలో కూడా ముచ్చుమర్రే గుర్తుకు వస్తోంది. ఇది నా పూర్వజన్మ సుకృతం. ముచ్చుమర్రి పర్యాటక ప్రదేశంగా మారాలి. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా. కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. జిల్లాలోని చెరువులన్నింటినీ నీటితో నింపుతాం’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు తడకనపల్లెలో పశువుల హాస్టల్‌ను సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో రూ.19 వేల కోట్లతో అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. తద్వారా 21వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ నెల రెండు లేదా మూడో వారంలో జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుందని వివరించారు. నంద్యాలను సీడ్‌ హబ్‌ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లాలో మొత్తం 27 ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా ఉన్నాయని.. వీటి కోసం రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకూ వెచ్చించామన్నారు. 
 
ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా 630 ట్యాంకులకు నీళ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముచ్చుమర్రితో కేసీ కెనాల్‌ ఆయకట్టును స్థిరీకరించామన్నారు. జిల్లాలో రాజకీయ తగాదాలు ఎక్కువగా ఉన్నాయని.. వీటికి స్వస్తి పలకాలని అధికార పార్టీ నేతలకు ఆయన హితవు పలికారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు తెలంగాణ తరహాలో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. అయితే, దీనిని అధ్యయనం చేద్దామన్నారు. ఇక కేసీ కెనాల్‌ వెంట రెయిన్‌గన్ల ద్వారా వ్యవసాయం చేసేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హమీనిచ్చారు.      
 
గుండ్రేవుల అవసరమా?
పట్టిసీమ ద్వారా డెల్టాకు గోదావరి నీటిని ఇచ్చి.. శ్రీశైలం నీటిని సీమకు తరలిస్తున్నామని సీఎం వివరించారు. ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల నీటి మట్టం ఉన్న సమయంలో కూడా నీటిని తోడుకునేందుకు అవకాశం ఉందన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు అంతర్‌ రాష్ట్ర వివాదాలు ఉన్నాయని.. ఇప్పుడు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అమలు తర్వాత గుండ్రేవుల అవసరం ఉందా? లేదా అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన డోన్, పత్తికొండ, ఆలూరు ప్రాంతాలకు హంద్రీనీవా నీటిని కాలువల ద్వారా తరలిస్తామన్నారు. ఇందుకోసం ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోందని తెలిపారు. సీమలో ఒకప్పుడు తుపాకులతో ఆడుకునేవారని.. ఇప్పుడు నీటితో జలకాలాటలు ఆడాలని వ్యాఖ్యానించారు. 854 నీటిమట్టం గురించి శ్రీశైలం డ్యామ్‌ వద్దకు వెళ్లి పోరాటం చేసేవారని.. ఇక మీరు గొడవలు చేసేందుకు అవకాశం లేదని రాజకీయ నేతలను ఉద్దేశించి అన్నారు. ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీ నీవా, కేసీ కెనాల్‌ వంటి కాలువలన్నీ అనుసంధానించి ఎక్కడ అవససం ఉంటే అక్కడకు నీరు ఇచ్చేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నా దృష్టిలో ఉన్నది రెండే రెండు కులాలన్నారు. పేద వాళ్ల కులం, డబ్బులున్న వారి కులమని.. తనది పేద వాల్ల కులమన్నారు.
 
రాయలసీమను అభివృద్ధి చేసేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాను, సాగునీటిశాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ అని... అయితే, ఇంజనీరింగ్‌ చదవని ఇంజనీర్‌ సీఎం చంద్రబాబు అని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ఇది ఒక చరిత్ర అని.. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్‌శాఖ అధికారులతో పాటు మెగా కంపెనీ ప్రతినిధులను సీఎం ప్రశంసించారు. 
 
అధికార పార్టీ కార్యక్రమంలా...!
వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అధ్యక్షత వహించడం ఆనవాయితీ. అయితే, నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్ద జరిగిన కార్యక్రమంలో మాత్రం ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగాన్ని మైక్‌ కట్‌ చేయడం ద్వారా అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను పక్కనపెట్టి ఇన్‌చార్జీకి అవకాశం ఇవ్వడంపై పలువురు మండిపడుతున్నారు. ఇది టీడీపీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమమా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే ప్రసంగాన్ని స్వయంగా సీఎంతో పాటు ఇతర అధికార పార్టీ ఎమ్మెల్యేలు మైక్‌ గుంజుకుని మరీ అడ్డుతగలడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వార్తలు