టైటానిక్ మునిగిపోయింది అందుకు కాదా? | Sakshi
Sakshi News home page

టైటానిక్ మునిగిపోయింది అందుకు కాదా?

Published Mon, Jan 2 2017 9:41 PM

టైటానిక్ మునిగిపోయింది అందుకు కాదా?

టైటానిక్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. కారణం జేమ్స్ కామెరూన్ టైటానిక్ విషాదగాథకు ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన చిత్రం. టైటానిక్ ను గురించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ బయల్దేరిన టైటానిక్ మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటనలో 1,500 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మంచుకొండను ఢీ కొట్టడం వల్ల ఘటన జరిగిందని మనందరికీ తెలుసు.
 
అయితే, మంచుకొండను ఢీ కొట్టడమే ఈ దుర్ఘటనకు కారణం కాదని పరిశోధకుడు, జర్నలిస్టు సెనాన్ మొలొని చెబుతున్నారు. టైటానిక్ కు సంబంధించిన చిత్రాలను ముప్ఫై ఏళ్లుగా పరిశీలిస్తున్న ఆయన ఓడ అడుగుభాగంలో 30 అడుగులు వెడల్పు ఉన్న నల్లని మచ్చను గుర్తించారు. ఈ మచ్చకు కొద్ది దూరంలోనే మంచుకొండను టైటానిక్ ఢీ కొట్టింది. 
 
ఓడను నడపడానికి అడుగుభాగంలో ఇంజన్ ను ఉంచారు.  ఇంజన్ కు శక్తినందించేందుకు టన్నుల కొద్దీ బొగ్గును నిరంతరం రగుల్చుతుండటం వల్ల ఆ ప్రాంతంలో వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉండేదని సెనాన్ చెప్పారు. దీనివల్ల ఓడ అడుగుభాగం బలహీన పడిందని అదే సమయంలో మంచుదిబ్బను ఓడ ఢీ కొట్టడంతో టైటానిక్ కథ విషాదాంతమైందని చెప్పారు. 

Advertisement
Advertisement