కడప గడపలో మురళీగానం

12 Dec, 2016 14:54 IST|Sakshi
కడప గడపలో మురళీగానం

కడప కల్చరల్‌ :  భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన గంధర్వ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళవారం తనువు చాలించారు. తన గంధర్వ గానాన్ని దివిలోని గంధర్వులకు నేర్పేందుకు ఆయన తరలి వెళ్లారని కడప నగరానికి చెందిన పలువురు పెద్దలు, సంగీతజ్ఞులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కడప నగరంలో రెండు రోజులు వరుసగా కచేరీలు చేసినపుడు తాము పాల్గొన్న జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. మహా గాయకుడు మంగళంపల్లి కడప నగర పర్యటన గురించి పలువురు పెద్దలు చెప్పిన సమాచారం 'సాక్షి' పాఠకుల కోసం..
    - మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1982లో కడప నగరంలోని శ్రీరామకృష్ణ హైస్కూలు ఆవరణంలోగల వివేకానంద ఆడిటోరియంలో వరుసగా రెండు రోజులు కచేరీలు చేశారు. అప్పట్లో స్థానిక కవి, రిటైర్డ్‌ ఎండీఓ ఎన్‌సీ రామసుబ్బారెడ్డి నాగరాజుపేటలో త్యాగరాజ సంగీత నృత్య కళాశాల నిర్వహించేవారు. జిల్లా వాసులకు మంగళంపల్లి గానమాధుర్యాన్ని రుచి చూపి సంగీతం పట్ల ఎక్కువ మందికి మక్కువ కల్పించాలని రామసుబ్బారెడ్డి మంగళంపల్లిని కడప నగరానికి ఆహ్వానించారు. 1982 జూన్‌ 22న మంగళంపల్లి కడప నగరానికి వచ్చారు. వివేకానంద ఆడిటోరియంలో ఆహూతులైన ప్రేక్షకుల సమక్షంలో సంగీత కచేరీ చేశారు. తన గానమాధుర్యంతో నగర వాసులను ఓలలాడించారు. దీంతో స్థానిక బ్రాహ్మణ సంఘాలు మరోరోజు కచేరీ చేయాలని ఆయనను ఒత్తిడి చేశారు. అంగీకరించిన బాలమురళి 23వ తేది కూడా కచేరీ చేశారు. ఆడిటోరియం సరిపోక అప్పటికప్పుడు మరికొన్ని కుర్చీలు తెప్పించి ఆడిటోరియం బయట కూడా వేయించారు. కచేరీ రెండు గంటలపాటు కొనసాగింది.
- సరస్వతిపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు కచేరీ సమయంలో బాలమురళి పక్కనే కూర్చొని సంగీతాన్ని ఆస్వాదించారు. ఎప్పుడూ ఎవరినీ పొగడని ఆయన వేదికపై బాలమురళి గాత్రాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అదే రోజు బాలమురళి స్థానిక కవులు, రచయితలు, నగర ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
- ఆకాశవాణి కడప కేంద్రం అప్పటిస్టేషన్‌ డైరెక్టర్‌ పీఆర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళంపల్లి కచేరీని రికార్డు చేసింది. నాటి రెండు రోజుల సభకు ఆకాశవాణికి చెందిన మడిపల్లి దక్షిణామూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సంగీతజ్ఞుల నివాళి..
    బాలమురళీకృష్ణ కడపలో చేసిన సంగీత కచేరీలకు హాజరైన సీనియర్‌ కవి ఎన్‌సీ రామసుబ్బారెడ్డి, ఆయన సహచరుడు, కవి సుబ్బరాయుడు,   ప్రముఖులు డాక్టర్‌  మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి బాలమురళి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీనియర్‌ గాయకులు వీఎస్‌ రామానుజచార్యులు, టీవీఎస్‌ ప్రకాశ్, యలమర్తి మధుసూదన, నేలబొట్ల చంద్రశేఖర్‌రావు, శ్రీవాణి అర్జున్‌లు మంగళంపల్లి మృతితో భారతీయ, శాస్త్రీయ సంగీత మేరువు కూలిపోయినట్లేనని నివాళులర్పించారు. కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ వ్యవస్థాపకులు కొండూరు జనార్దన్‌రాజు, వైవీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ మూలమల్లికార్జునరెడ్డి, అంధుల పాఠశాల ఉపాధ్యాయుడు, కళాకారుడు  సాంబశివుడు, బి.కోడూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఇంకా పలువురు సంగీతాభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు