జలసమాధి వెనుక దిగ్భ్రాంతికర వాస్తవం

15 Dec, 2015 15:22 IST|Sakshi
జలసమాధి వెనుక దిగ్భ్రాంతికర వాస్తవం

రుణబాధతో కుటుంబాన్ని జలసమాధి చేశాడు
యూనాంలో ఆరుగురి జలసమాధి వెనుక దిగ్భ్రాంతికర వాస్తవం
ఒత్తిళ్లు తాళలేకే కుటుంబంతో సహా అంతం కావాలని నిర్ణయం
పథకం ప్రకారమే గోదారిలోకి కారు

 
యానాం టౌన్: రుణపాశమే ఆ కుటుంబం పాలిట యమపాశమైంది. లక్షలాది రూపాయలు అప్పులు చేసిన పవన్‌కుమార్.. ఆ భారాన్ని మోయలేక చివరకు కుటుంబాన్నే మృత్యుఒడికి తీసుకెళ్లాడు. అప్పుల ఊబి గురించి తెలియని ఆ కుటుంబ సభ్యులు పవన్ కుమార్‌ను నమ్మి గోదారిలో జలసమాధి అయ్యారు. రుణదాతల ఒత్తిళ్లతో కుటుంబాన్నే బలి తీసుకున్న ఈ కఠోర వాస్తవం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా యానాం వద్ద గోదావరిలో ఆరుగురు సభ్యుల కుటుంబం జలసమాధి ఘటనలో వెల్లడైన వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి.
 

యానాం-దరియూలతిప్ప రోడ్డులో దర్టీ కంపెనీ వద్ద శుక్రవారం రాత్రి గోదావరిలోకి కారు దూసుకువెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించిన విషయం విదితమే. కాకినాడ తూరంగిలోని రాఘవేంద్రపురానికి చెందిన కొప్పాడ సత్తిరాజు, ఆయన భార్య ధనలక్ష్మి, కుమారుడు పవన్‌కుమార్, కోడలు పార్వతి, మనవరాళ్లు రిషిత, హర్షిత దుర్మరణం పాలయ్యారు. పవన్‌కుమార్ మృతదేహాన్ని ఆదివారం గిరియూంపేట ఐలాండ్ వద్ద మత్స్యకారులు గుర్తించారు. దీన్ని అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంగా అందరూ భావించారు. అయితే పవన్ బంధువులు, అప్పులు ఇచ్చిన వారిని యానాం క్రైం పోలీసుల బృందం విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
 
వెలుగు చూసిన నిజాలు..
ఈ ఘటనలో వెలుగు చూసిన నిజాలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణియన్ యానాంలో సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. పవన్‌కుమార్ సుమారు రూ.75 లక్షల వరకు అప్పులు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ అప్పుల బాధ, ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్యకు పూనుకొనేందుకు పథకం వేశాడని, బహుశా ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఉండదని పేర్కొన్నారు.

అధిక మొత్తంలో సొమ్ములు ఇవ్వవలసిన కొంతమందికి ఈ నెల 13న ఇస్తానని పవన్‌కుమార్ చెప్పినట్లు తెలిసిందన్నారు. అతను కాకినాడలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో సబ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడని, అక్టోబర్ 31తో కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నట్టు తెలిపారు. ఘటన జరిగిన రోజు కారు గోదావరిలోకి దూసుకెళ్లిన ప్రదేశాన్ని పవన్‌కుమార్ ముందే వచ్చి చూసి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు