స్త్రీ చైతన్యమే ఈమె పరుగు లక్ష్యం!

12 Dec, 2016 15:08 IST|Sakshi
స్త్రీ చైతన్యమే ఈమె పరుగు లక్ష్యం!

ఇటీవలే ఎవరెస్టు అధిరోహించిన తెలుగు అమ్మాయి నీలిమ పూదోట. ధైర్యసాహసాలకు పెట్టింది పేరైన ఈ ధీర వనిత.. విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరుగెత్తి రికార్డు సృష్టించింది. ఇంత దూరం పరుగుపెట్టడమే కష్టమనుకుంటే.. పాదరక్షలు లేకుండా ఒట్టి పాదాలతోనే పరుగు కొనసాగించి మరింత సంచలనం సృష్టించింది నీలిమ. ఇదేదో పబ్లిసిటీకి చేసిన కార్యమని ఎంత సర్దిచెప్పుకున్నా.. ఆమె మారథాన్ లక్ష్యమేంటో తెలుసుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం..!

దేశంలో.. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే అతి వేగంగా వ్యాప్తి చెందుతోన్న జబ్బు రొమ్ము క్యాన్సర్. మహిళలను మానసికంగా శారీరకంగా కుంగదీస్తోన్న ఈ మహమ్మారిపై అవగాహన పెంచేందుకే నీలిమ ఇంత సాహసం చేసింది. రొమ్ము క్యాన్సర్ దరిచేరకుండా మహిళల జీవన శైలి మారేలా చైతన్య పరచాలి. అందుకోసమే నడుం బిగించింది ‘పింకథాన్’. మెట్రో నగరాల్లో త్రీకే, ఫైవ్ కే, టెన్ కే రన్ నిర్వహిస్తూ మహిళలను, యువతులను ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే నీలిమ ఒట్టి కాళ్లతో లాంగ్ రన్ చేయాలని నిశ్చరుుంచుకుంది. అలా విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరిగెత్తి అరుదైన రికార్డు నెలకొల్పింది.


ఏదైనా అనుకుంటే చేసేయడం నీలిమకు మొదట్నుంచీ ఉన్న అలవాటు. పింకథాన్‌లో పాల్గొనడానికి నీలిమ 5 నెలలు ప్రాక్టీస్ చేసింది. సూర్యోదయం కంటే ముందే పరుగు ప్రారంభించి సాయంత్రానికి ఆగిపోయేది. ఇదొక్కటే కాదు.. నీలిమ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అన్నీ రికార్డులే.

 గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ మంచి రైటర్, డాన్సర్. హార్స్ రైడింగ్ తెలుసు. పాటలు కూడా పాడుతుంది. ఏదైనా చేయాలని అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా మారుతుంది. ఆమెకు తల్లిదండ్రులూ ఏనాడూ అడ్డుచెప్పలేదు. మొన్నటికి మొన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ 570 కి.మీ. దూరం సైకిల్ మీద ప్రయాణించింది. తాజాగా పింకథాన్ లో బేర్‌ఫుట్ రన్నర్‌గా మరో అరుదైన ఫీట్ సాధించింది. నీలిమ సంకల్ప బలం ముందు ముళ్లబాటలు కూడా పూల బాటలవుతున్నారుు. ఈమె ప్రయాణం మరింత దూరం సాగాలని కోరుకుందాం..!

మరిన్ని వార్తలు