రైళ్లు.. బస్సులు.. ఖాళీల్లేవ్ !

30 Dec, 2015 16:10 IST|Sakshi
రైళ్లు.. బస్సులు.. ఖాళీల్లేవ్ !

ప్రయాణాలపై సంక్రాంతి ప్రభావం
టిక్కెట్లు అమ్మకాలు నిలిపేసిన ప్రైవేటు బస్ ఆపరేటర్లు
ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్‌లు

 
 
తణుకు : సంక్రాంతికి ఊరు వెళదామనుకున్నా, యాత్రలకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ చేయించుకునేందుకు వెళ్లే వారికి మాత్రం చుక్కెదురవుతోంది. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ పూర్తయిపోయింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో తర్వాత ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ భర్తీ అవుతున్నాయి. మరోవైపు వెయిటింగ్ లిస్టు సైతం నిండిపోవడంతో ఒక్కో రైలులో నో రూం అని వస్తోంది.
 
వేలాది మందిపై ప్రభావం
జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా సుమారు 25 వరకు ముఖ్యమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాకు చెందినవారు ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబయి, చెన్నై వంటి నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాధారణంగా రెండు, మూడు రోజుల పాటు వరుస సెలవులు వస్తేనే సొంతూరుకు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. సంక్రాంతికి ఈసారి విద్యాసంస్థలకు రెండు వారాలపాటు సెలవులు రావడంతో స్వస్థలాలకు చేరుకోవాలని పలువరు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
 
ఈ పరిస్థితుల్లో ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, నిడదవోలు పట్టణాల మీదుగా నిత్యం మూడు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పండగ సమయాల్లో అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో కనీసం టిక్కెట్టు తీసుకునే స్థితి లేకుండా పోయింది. దీంతో తాత్కాల్‌పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు.
 
ఆర్టీసీదీ అదే తంతు
ఆర్టీసీ అధికారులు పండగ రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపాలనే యోచనలో ఉన్నారు. కొందరు తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోగా మిగిలిన వారంతా పండగ తర్వాత ఆయా నగరాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధార పడక తప్పదు. ఈ పరిస్థితుల్లో జనవరి 20 వరకు ఖాళీల్లేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే పండుగ తర్వాత రూ. వెయ్యి పైబడి చెబుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపినా టిక్కెట్టు ధర మాత్రం భారీగానే పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు రైళ్లన్నీ నిండుకోవడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బస్సు ఆపరేటర్లు టిక్కెట్లు బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు