‘ఎడారిలో ఒయాసిస్ బాలోత్సవ్’

13 Nov, 2015 21:23 IST|Sakshi

పారంభోత్సవ సభలో ప్రొఫెసర్ కోదండరాం
తొలిరోజు 9 రాష్ట్రాల నుంచి 9 వేలమంది చిన్నారులు
కొత్తగూడెం(ఖమ్మం): ‘చిన్నారులు ఆడుకుందామంటే సరైన ఆటస్థలాలు లేవు.. చదువుకుందామంటే పుస్తకాలు సక్రమంగా లేవు.. ఇలాంటి పరిస్థితిలో చిన్నారులలో ఉన్న అభిరుచిని వెలికితీసేందుకు ఈ జాతీయస్థాయి బాలోత్సవ్ ఎడారిలో ఒయాసిస్‌లా పనిచేస్తుంది.’ అని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎ.కోదండరాం అన్నారు. 24వ అంతర్‌బాలల సాంసృ్కతిక ఉత్సవాలు (జాతీయస్థాయి బాలోత్సవ్ - 2015) ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఖమ్మం పట్టణానికి చెందిన బాలమేధావి ఎస్.కె.సాధిక్‌పాషా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించాడు.

అనంతరం జరిగిన ప్రారంభ సభలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా చదివే పరిస్థితులు లేవన్నారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుందని, దానిని ప్రొత్సహిస్తే వారిలో ఉన్న ప్రతిభ, వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. గతంలో కొత్తగూడెం పట్టణం అంటే తనకు కేవలం బొగ్గు మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంతమంది చిన్నారులను చూసి మరోకోణం నేర్చుకున్నానని తెలిపారు.

దాదాపు పాతికేళ్లుగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమాన్ని మరో వందేళ్లపాటు కొనసాగించాలన్నారు. పిల్లలు పెద్దలై.. పెద్దలకు నేర్పే విషయాలను ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలన్నారు. వచ్చే ఏడాది కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని తెలిపారు. బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వందల మంది తనకు తోడ్పాటునందించారన్నారు. బాలల కోసం ఏదైనా చేయాలనే తపనతో తాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖకవి అంద్శై కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్‌రావు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. తొలిరోజు 16 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన పాఠశాలల నుంచి సుమారు తొమ్మిదివేల మంది బాలబాలికలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు