రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

12 Sep, 2016 22:32 IST|Sakshi
లారీ కింద భీసన్న మృతదేహాం
మహబూబ్‌నగర్‌ క్రైం: పట్టణ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి లారీ కిందపడి దుర్మరణం చెందాడు. జిల్లాకేంద్రంలోని అశోక్‌ టాకీస్‌ చౌరస్తాలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ సమీపంలో మహారాష్ట్రకు చెందిన ఓ లారీ ముందు టైర్ల కిందపడి  వ్యక్తి అత్యంత దారుణంగా మృత్యువాతపడ్డాడు. సంఘటన స్థలాన్ని టూటౌన్‌ సీఐ డీవీపీ రాజు, ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ మురళి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. గండీడ్‌ మండలం కొండపూర్‌కి చెందిన భీసన్న అలియాస్‌ వెంకటయ్య(50)సోమవారం ఉదయం 11గంటల సమయంలో అల్లీపూర్‌ నుంచి వస్తువులు కొనుగోలు చేయడానికి పట్టణంలో క్లాక్‌టవర్‌ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేవరకద్ర నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న ఎంహెచ్‌ 46ఏఎఫ్‌ 7996నంబర్‌ కలిగిన లారీ ముందు టైర్ల కింద ప్రమాదవశాత్తు పడటంతో అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. మృతుడు భీసన్న ఇటీవల మండలపరిధిలో అల్లీపూర్‌లో ప్లాట్‌ తీసుకుని అక్కడ కొత్త ఇల్లు నిర్మాణం చేయిస్తున్నాడు. దీనికోసం మూడు రోజుల కిందట అల్లీపూర్‌కి వచ్చాడు. కొత్త ఇంటికి సమాన్లు అవసరం ఉండటం వల్ల పట్టణానికి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 
 భారీ ట్రాఫిక్‌ జాం..
అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. లారీ కిందపడి మృతి చెందిన వ్యక్తిని చూడడానికి చాలామంది రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దాదాపు గంటపాటు శ్రమించి ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.
మరిన్ని వార్తలు