వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి దుర్మరణం

12 Mar, 2017 00:04 IST|Sakshi

పెద్దవడుగూరు(గుత్తి రూరల్‌) : జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... గుత్తి శివార్లలోని గేట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిలో జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి(45) అక్కడికక్కడే మరణించాడు. అనంతపురం వైపు నుంచి గుత్తి వైపునకు కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

లేపాక్షి మండలంలో...
లేపాక్షి : మండలంలోని శిరివరం చెరువు కట్ట కింద శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన లగేజీ ఆటో శిరివరం నుంచి మానేపల్లికి బయలుదేరింది. హిందూపురం నుంచి శిరివరానికి వస్తున్న ఆటో పరస్పరం ఢీకొనడంతో శిరివరానికి చెందిన మూర్తి(36), ఆటో డ్రైవర్‌ రమేశ్‌(42), ఆర్టీసీ డ్రైవర్‌ రామప్ప(52) తీవ్రంగా గాయపడ్డారు. వారితో పాటు మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే వారందరినీ 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాటక ఆటో డ్రైవర్‌ అతిగా మద్యం తాగి నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా స్థానికులు ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కోలుకుంటున్న క్షతగాత్రులు
కదిరి టౌన్‌ : తనకల్లు మండలం చీకటిమానిపల్లె సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు కదిరి ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాదంలో చిత్తూరు జిల్లా పీటీఎం మండలం శ్రీణఙవాసరాయునిపల్లెకు చెందిన ముగ్గురు మరణించగా, మరో పది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. వారంతా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. శంకరప్ప అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. 

మరిన్ని వార్తలు