అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి

14 Feb, 2016 20:56 IST|Sakshi
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఏపీని వైద్యఆరోగ్య రంగంలో ఉన్నత స్ధానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. సీఆర్డీఏ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్య నిపుణుల జట్టును కామినేని అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో తొలి దశలో భాగంగా అవయవాల మార్పిడికి ఆదేశాలు  జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో 120 మానవ అవయవాల హార్వెస్టింగ్  పూర్తి అయ్యిందని ఇందులో 30 అవయవాలను బాధితులకు అమర్చినట్లు ఆయన వెల్లడించారు. జీవన్ దాన్ ద్వారా అవయవదానం కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు.

500 మంది డాక్టర్స్, 1000 మంది నర్స్లు, 16 మంది ఆసుపత్రి అడ్మిన్ స్టేటర్స్ను కాంట్రాక్ట్ ప్రాతిపదికనా ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి జీవో జారీ చేశామన్నారు. త్వరలోనే ఈ పోస్ట్ల భర్తీకు నియామకాలు పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి తన అవయవాలను దానం ఇస్తే 5 గురు బాధితులకు కొత్త జీవితం లభిస్తుందన్నారు. ఏపీలో ఎయిమ్స్ను నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి కామినేని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు