‘ఔటర్’ పరిసరాల్లో ప్రత్యేక నగరం

29 Nov, 2015 02:04 IST|Sakshi
‘ఔటర్’ పరిసరాల్లో ప్రత్యేక నగరం

 4 వేల ఎకరాల్లో నిర్మించాలని రియల్టర్లకు సీఎం కేసీఆర్ సూచన
 
 సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఏ నగరాభివృద్ధిలోనైనా రియల్ ఎస్టేట్ రంగానిది అత్యంత ప్రధాన పాత్ర అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కీలక భూమిక నిర్వహించాలని పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఓ సమాఖ్యగా ఏర్పడి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిసర ప్రాంతాల్లో మూడు, నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక నగరం నిర్మించాలని, గ్రీన్‌ఫీల్డ్ కార్యకలాపాలను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య (క్రెడా) పూర్వ అధ్యక్షుడు సి.శేఖర్ రెడ్డి, తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.రామిరెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు ఎస్.రామిరెడ్డి ఆధ్వర్యంలో సమాఖ్య ప్రతినిధులు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై రియల్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఆయా దేశాలు, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి సూచికగా ఇవి నిలుస్తాయన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, సినిమా సిటీ రాబోతున్నాయని, బెంగళూరు నగరం కిక్కిరిసిపోతున్నందున ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్‌కే వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రియల్టర్లు మరింత వ్యూహాత్మకంగా నగర విస్తరణలో భాగం కావాలని హితవు పలికారు.

హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండాలి? అనే విషయంలో హెచ్‌ఎండీఏ రూపొం దించే బృహత్తర ప్రణాళికలోనూ వారు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ గమనాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూనే, ఇతర నగరాలనూ అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు