నేడు కడపలో పాస్‌ పోర్టు కార్యాలయం ప్రారంభం

3 Apr, 2017 00:37 IST|Sakshi
కడప కార్పొరేషన్‌:  జిల్లా వాసుల నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న పాస్‌పోర్టు కార్యాలయం కడపలో ఏర్పాటు కాబోతోంది. సోమవారం పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాస్‌పోర్టు కేంద్రాన్ని కడపలో ఏర్పాటు చేయించడంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించడంతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు పలుసార్లు లేఖలు రాశారు. ఎంపీ రాసిన లేఖలకు మంత్రి ఇటీవల రాతపూర్వకంగా సమా«ధానమిచ్చిన విషయం పాఠకులకు విదితమే. పాస్‌పోర్టు కార్యాలయ ఏర్పాటుకు కృషి చేయడమేగాకుండా సిబ్బంది అభ్యర్థన మేరకు ఫర్నీచర్, ఏసీలు తదితర సామగ్రి కోసం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రూ.1.50 లక్షలు సొంతంగా వెచ్చించారు. ఎంపీ తోడ్పాటుతో అధికారులు పాస్‌ పోర్టు కార్యాలయానికి కావాల్సిన గదులను పూర్తి స్థాయిలో నిర్మించి, అసవరమైన ఫర్నీచర్‌ను సిద్ధం చేశారు. ఇది వరకు జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారు, విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు పాస్‌పోర్టు కోసం తిరుపతి, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ క్రమంలో పాస్‌పోర్టు జారీలో ఆలస్యం అయినా, డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోయినా, ఇతరత్రా లోటు పాట్లు జరిగితే పలుమార్లు ఆ ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర వ్యయప్రయాసలకు లోనయ్యేవారు. దీంతో వారి సమయం వృథా కావడంతోపాటు, తీవ్ర శ్రమ పడాల్సి వచ్చేది. కడపలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటు కావడం వల్ల జిల్లా వాసులకు ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలగనుంది. జిల్లాలో అత్యధిక మంది జీవనోపాధి కోసం గల్ఫ్‌ దే«శాలైన కువైట్, సౌదీఅరేబియా, ఖత్తర్‌కు వెళ్తున్నారు. అలాగే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఏడాదికి దాదాపు 50 వేల మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కొత్త పాస్‌పోర్టుల కోసం ఇంతే సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని  కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎట్టకేలకు జిల్లాలో పాస్‌ పోర్టు కార్యాలయం ఏర్పాటు అవుతుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
 
మరిన్ని వార్తలు