నాటుతున్నారు.. నరుకుతున్నారు

10 Aug, 2017 01:22 IST|Sakshi
నాటుతున్నారు.. నరుకుతున్నారు

దశాబ్దాల నాటి వృక్షాలకు కాలం చెల్లు
రోడ్డు వెడల్పులో నేల కూలుస్తున్న వైనం
కూల్చిన ఒక చెట్టు స్థానంలో10 మొక్కలు నాటాలని డిమాండ్‌


నెహ్రూ సెంటర్‌(మహబూబాబాద్‌): తెలంగాణకు హరితహారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం విధించిన టార్గెట్‌తో ఓ వైపు లక్షలాది మొక్కలు నాటుతున్న అధికారులు.. మరోవైపు రోడ్డు వెడల్పు పనుల్లో దశాబ్దాల కాలం నాటి భారీ వృక్షాలను నేల కూలుస్తున్నారు.  మరికొన్ని చోట్ల విద్యుత్‌ సరాఫరాకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రజలను చైతన్యపరిచి మొక్కలు నాటించే అధికారులే ఇలా వృక్షాలను తొలగిస్తున్న తీరును చూసి  ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి తాళ్లపూసపల్లి గ్రామం వరకు ఫోర్‌లైన్‌ రోడ్డు వెడల్పు పనులను ఇటీవల చేపట్టారు. రోడ్డు వెడల్పులో వందలాది వృక్షాలు నేలకూలుతున్నాయి. ఇందులో శతాబ్దం కాలం నాటి చింతచెట్లు, వేపచెట్లు, కానుగ చెట్లను జేసీబీలతో కూకటివేళ్లతో పెకిలించి బయటపడేస్తున్నారు. ఇలా పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో 30 వేప చెట్లు, 10 చింతచెట్లు, 50 కానుగ వృక్షాలను తొలగించారు. ఇంతకాలం తోడునీడగా ఉన్న వృక్షాలను తొలగించడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన ఒక్కో వృక్షం స్థానంలో సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్‌ 10 మొక్కలు నాటాలని డిమాండ్‌ చేశారు.

అందుకు తనకు సంబంధం లేదని ఏదైనా ఉంటే అధికారులకు చెప్పాలని కాంట్రాక్టర్‌ తెలిపారన్నారు. రోడ్డు పనులు పూర్తయిన వెంటనే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని కాలనీవాసులు కోరుతున్నారు. విద్యుత్‌ తీగలకు అడ్డువస్తున్న చెట్లను తొలగించకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలే తప్పా చెట్లను నరకొద్దని విద్యుత్‌శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు