యాంబీ వ్యాలీ వేలం నిలిపివేయండి! | Sakshi
Sakshi News home page

యాంబీ వ్యాలీ వేలం నిలిపివేయండి!

Published Thu, Aug 10 2017 1:17 AM

యాంబీ వ్యాలీ  వేలం నిలిపివేయండి! - Sakshi

సుప్రీంకు సహారా అభ్యర్థన  
న్యూఢిల్లీ: యాంబీ వ్యాలీ ఆస్తి వేలాన్ని నిలిపేయాలని సహారా చీఫ్‌ సుబ్రతో రాయ్‌ బుధవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు గ్రూప్‌ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేయటమే కాక... పునః చెల్లింపుల్లో విఫలమైన కేసులో రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలానికి ఇంతక్రితం  బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ను నియమిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఇందుకు సంబంధించి లిక్విడేటర్‌ నోటీసు ప్రచురించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సహారా తాజా పిటిషన్‌ దాఖలు చేసింది.

చెల్లింపుల ప్రణాళికను సుప్రీం ముందు సహారా ఉంచుతున్నందున మహారాష్ట్ర పూనే జిల్లాలో ఉన్న ఈ ఆస్తి వేలం నిలిపివేయాలని రాయ్‌ కోరారు. అయితే కేసు విచారణ తేదీని తరువాత నిర్ణయిస్తామని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది. చెల్లించాల్సిన మొత్తం రూ.24,000 కోట్ల నిధుల్లో మిగిలిన దాదాపు రూ.9,000 కోట్ల చెల్లింపులకు 18 నెలల సమయాన్ని ఇప్పటికే సహారా కోరింది. అయితే వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నది సెబీ వాదన.

Advertisement
Advertisement