పీహెచ్‌సీలకు పురుటి నొప్పులు

18 Jan, 2017 22:28 IST|Sakshi
పీహెచ్‌సీలకు పురుటి నొప్పులు
ప్రసూతి కేసులు ప్రైవేటు ఆస్పత్రులకే
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మృగ్యం
 అన్నిచోట్లా అధ్వాన్న పరిస్థితులే
 
 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు ప్రసూతి సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కాన్పు కోసం వచ్చే గర్భిణులను ప్రైవేటు ఆస్పత్రులకు తరిమేస్తున్నాయి. జిల్లాలో ప్రసూతి వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 79 ఉండగా.. మూడు ఏరియా ఆస్పత్రులు, 11 కమ్యూనిటీ వైద్య కేంద్రాలతోపాటు ఏలూరులో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు జిల్లా వ్యాప్తంగా 41,372 ప్రసవాలు నమోదు కాగా.. వీటిలో 19,622 జననాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. 21,750 మంది గర్భిణులు ప్రసూతి సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ’సాక్షి’ బృందం బుధవారం పరిశీలన జరపగా.. వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టాయి.
 
ప్రైవేటు సేవలే దిక్కు
ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలని చెబుతున్నా.. వాటిలో సదుపాయాల లేమి, వైద్యుల కొరత కారణంగా గర్భిణులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు అత్యవసర సమయాల్లో పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ’ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం.. తల్లీబిడ్డ సురక్షితం’ అంటూ అధికారులు బోర్డులు తగిలించి చేతులు దులుపుకుంటున్నారు. గర్భిణులకు ప్రసూతి సేవలు, శస్త్ర చికిత్స, మందులు, ఆరోగ్య పరీక్షలు, ఆహారం, రక్తం, రవాణా సదుపాయాలన్నీ ఉచితమని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న తల్లులకు జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి పారితోషికం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆస్పత్రులకు భవనాలు నిర్మించినా ప్రసూతి సమయంలో అవసరమైన సర్జికల్‌ మెటీరియల్‌ అందుబాటులో లేదు. చాలాచోట్ల పుట్టిన బిడ్డల్లో కొందరిని అత్యవసరంగా ఇంక్యుబేటర్‌ సేవలు అవసరమవుతోంది. అలాంటి సేవలు చాలాచోట్ల అందుబాటులో లేవు. వార్మర్స్, ఊయలను నేటికీ ప్రభుత్వం అందించలేదు. చాలాచోట్ల వైద్య పరికరాలు బిగించక నిరుపయోగంగా మారాయి. దీంతో పీహెచ్‌సీలకు వచ్చే గర్భిణుల్లో అధిక శాతం మందిని ప్రైవేట్‌ ఆస్పత్రులను రిఫర్‌ చేస్తున్నారు. బాలింతలకు, వారితో వచ్చే కుటుంబీకులకు భోజనం సదుపాయం కల్పించడంతోపాటు పాలు ఇవ్వాల్సి ఉంది. ప్రసవాల సంఖ్య ఆధారంగా, స్థానికంగా ఉన్న సౌకర్యాలు బట్టి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. లేదంటే ఆ ఖర్చులను కూడా చెక్కుల రూపంలో చెల్లిస్తున్నారు. బిడ్డ సంరక్షణకు చైల్డ్‌ కిట్‌ను ప్రస్తుతం అందజేస్తున్నారు.
 
ఎక్కడ చూసినా సమస్యలే..
 ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన 100 పడకల మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో వసతులున్నా వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అలంకారప్రాయంగా మారింది. 11 మంది గైనకాలజిస్ట్‌లు అవసరం కాగా.. కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆపరేషన్‌ చేసే సమయంలో గర్భిణికి మత్తు ఇచ్చే వైద్యులు లేనేలేరు. ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులకు సహకరించేందుకు ఆరుగురు టెక్నీషియన్‌ అవసరం కాగా, ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. అత్యవసర సమయాల్లో విద్యుత్‌ కోత విధిస్తే.. జనరేటర్‌ కూడా లేదు. 
 
 జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చాటపర్రు, గుడివాకలంక కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందడం లేదు. అక్కడ వైద్య పరీక్షలకే పరిమితం కావడంతో ప్రసవం కోసం గర్భిణులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 
 
 జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 3 నుంచి 5 డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ పీహెచ్‌సీలో ఏడాదిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
 వీరవాసరం, కొణితివాడ పీహెచ్‌సీల్లో ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నా.. పూర్తిస్థాయి పరికరాలు, గైనకాలజిస్ట్‌లు లేరు. ఆపరేషన్లు అవసరమైతే పాలకొల్లులోని సీహెచ్‌సీకి గర్భిణులను పంపిస్తున్నారు.
 
 24 గంటలూ ప్రసూతి సేవలు అందించే కాళ్ల పీహెచ్‌సీ భవనం శిథిలావస్థకు చేరింది. ఇందులోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. ఫస్ట్‌ ఏన్‌ఎం పోస్టులు 5, సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఒక స్టాఫ్‌ నర్స్, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. 
 
 తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, మాధవరం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాలకు మాత్రమే సేవలందిస్తున్నారు. అత్యవసర కేసులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. ఈ రెండు పీహెచ్‌సీలలో ప్రసవ ఆపరేషన్‌ (సిజేరియన్‌)లకు సదుపాయాలు లేవు.
 
 భీమడోలు మండలం పూళ్ల పీహెచ్‌సీలో 16 మంది పని చేయాల్సి ఉండగా ఏడుగురు ఏఎన్‌ఎంలు మాత్రమే ఉన్నారు. స్టాఫ్‌ నర్సు పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పురుడు పోసుకున్న 66 మందిలో జననీ సురక్ష యోజన ప్రోత్సాహకం నిమిత్తం 48 మంది వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. 
 
 బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం, కేఆర్‌పురం, నందాపురం, అంతర్వేదిగూడెం, దొరమామిడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే, వీటిలో గైనకాలజిస్ట్, పిల్లలకు వైద్యసేవలందించే డాక్టర్ల పోస్టులు ఒక్కటి కూడా భర్తీ కాలేదు.
 
 భీమవరం ప్రభుత్వాస్పత్రిలో బాలింతలను ఉంచే గదులు అధ్వానంగా ఉన్నాయి. బూజులు పట్టిన గోడలు, పగిలిపోయిన కిటికీలు, చిరిగిపోయి గట్టిపడిన మంచాలతో చూడటానికే ఇబ్బందిగా ఉన్నాయి. ఽచిరిగిన మంచాలపైనే బాలింతలు ఇబ్బందులు పడుతూ పడుకుంటున్నారు.
 
 రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలోని చాలా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత అధికంగా ఉంది. సౌకర్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. చింతలపూడి మండలం రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులున్నా ఆపరేషన్‌ థియేటర్‌ లేదు. 
 
మరిన్ని వార్తలు