-

నోళ్లు తెరిచిన బోర్లు మూసేయండి

4 Feb, 2016 03:29 IST|Sakshi
నోళ్లు తెరిచిన బోర్లు మూసేయండి

వృథా బోరుబావులపై యంత్రాంగం సమరం
అక్కరకు రానివాటి మూసివేతకు నిర్ణయం
అలాంటివి ఎన్నున్నాయో తేల్చేపనిలో నిమగ్నం

 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండేళ్ల క్రితం నాలుగేళ్ల గిరిజ మంచాలలోని వ్యవసాయ క్షేత్రంలో నిరుపయోగ బోరు బావిలో పడి మరణించింది. సరిగ్గా ఏడాది క్రితం కుల్కచర్ల మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నా బాలిక మాత్రం క్షేమంగా బయటికొచ్చింది.’ ఇకపై బోరుబావుల్లో ప్రమాదాల ఘటనలే జరగొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడి మరణించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
 
 దీంతో అధికారుల అప్రమత్తమయ్యారు. జిల్లాలో తెరిచిఉండి అక్కరకు రాని బోరుబావుల లెక్క తేల్చేందుకు ఉపక్రమించారు. వీటి గుర్తింపునకు జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. వాటికనుగుణంగా వివరాలు సేకరించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు.
 
 భూగర్భ జల శాఖ నుంచి లెక్కలు..
 బోరు వేయాలంటే భూగర్భజల శాఖ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఆ శాఖ వద్ద ఉన్న గణాంకాల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అయితే చాలా మంది భూగర్భ జల శాఖ అనుమతి లేకుండా విచ్చలవిడిగా బోర్లు వేశారు. ఈక్రమంలో వాటిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా వారంలోపు నిర్ణీత నమూనా ప్రకారం బోరుబావుల లెక్కలు తీస్తే.. వాటికనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నటు అధికారులు చెబుతున్నారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మాత్రం వెంటనే మూసివేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాలు జారీ చేశారు.

 అధికారులపై క్రిమినల్ కేసులే...
 ఇకపై బోరుబావుల్లో ప్రమాధాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, రెవెన్యూ అధికారులతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి బోరుబావుల మూసివేతకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.
 

మరిన్ని వార్తలు