చక్కదిద్దాలి బాస్‌..!

6 Jul, 2017 02:42 IST|Sakshi
చక్కదిద్దాలి బాస్‌..!

జిల్లాలో శ్రుతిమించుతున్న కొందరు పోలీసుల ఆగడాలు
అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న వైనం
మూడు గంటలపాటు మృతదేహాన్ని కనిపించకుండా చేసిన ఓ ఎస్సై
టీడీపీ నేత తన టోపీ పెట్టుకున్నా పట్టించుకోని మరో ఎస్సై
కొత్తగా వచ్చిన డీఐజీ, ఎస్పీలైనా వీరి ఆగడాలను అరికట్టాలని కోరుతున్న ప్రజలు


గతంలో పోలీస్‌ అంటే గౌరవం ఉండేది. ప్రస్తుతం జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరుతో అమ్మో పోలీస్‌..అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నేతల అండదండలతో పోలీసులు అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. ఖాకీ చొక్కాలు తొడుక్కున్న పచ్చ నేతల్లా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులపైనే కేసులు పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. మొత్తంగా పోలీసు శాఖ పరువును బజారు కీడుస్తున్నారు.

సాక్షి, గుంటూరు: జిల్లాలో రెండేళ్ల కాలంలో కొందరు పోలీసు అధికారులు అనుసరిస్తున్న తీరు పోలీసు శాఖకు చెడ్డపేరు తెచ్చి పెట్టింది. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి అధికార పార్టీ నేతల ఒత్తిడితో బాధితులకు అన్యాయం చేస్తున్నారు. అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు పోలీసు శాఖపై పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ తాము చెప్పిందే శాసనంగా నడవాలనే విపరీత ధోరణిలో వ్యవహరించిన విషయం తెలిసిందే. కొందరు పోలీసు అధికారులు సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తూ వారికి తొత్తులుగా మారిపోయారు.

బాధితులపై అక్రమ కేసులు
ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతల మెప్పు కోసం బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట వంటి ప్రాంతాల్లో  అధికార పార్టీ నేతల ఆగడాలను అడ్డుకొనే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వీరు మరో అడుగు ముందుకేసి టీడీపీలో చేరకపోతే కేసుల్లో ఇరికిస్తామంటూ ఖాకీ తొడుక్కున్న పచ్చ చొక్కాలుగా వ్యవహరిస్తున్నారు.

అధికార పార్టీ చెప్పిందే వేదం..
రెండు నెలల క్రితం కాకుమాను మండలంలో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ ఘటనలో భర్త తరపు వారు అధికార పార్టీ నేతలకు అనుయాయులు కావడంతో అప్పట్లో అక్కడ పని చేస్తున్న ఎస్సై పోస్టుమార్టం అనంతరం గుంటూరు తీసుకెళుతున్న మృతదేహాన్ని అడ్డగించి దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. దీంతో అప్పట్లో పోలీసు శాఖ పరువు బజారున పడింది. అధికారుల ఆదేశాల మేరకే అలా చేశానంటూ ఎస్సై చెప్పడంతో ఆయనను బదిలీ చేసి పోలీసు ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. పది రోజుల క్రితం కారంపూడి పోలీసుస్టేషన్‌లో అధికార పార్టీ నేత ఎస్సై గదిలోనే ఎస్సై టోపీ పెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో పోలీసు ప్రతిష్ట దిగజారిపోయింది.

దీనిపై కొత్తగా వచ్చిన రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు విచారణకు ఆదేశించారు. సత్తెనపల్లిలో ముఖ్యనేత తనయుడు భూ ఆక్రమణలకు స్థానిక పోలీసులే కాపలా ఉండి బాధితులను అటు వైపు రాకుండా నిలువరించి కబ్జాకు సహకరించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. రాజుపాలెం మండలంలో నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే పనులు నిర్వహిస్తున్న కూలీలు, అధికారులు, ఇంజినీర్లపై ముఖ్యనేత తనయుని వర్గీయులు దాడులు చేసి గాయపరచడమే కాకుండా అక్కడ ఉన్న షెడ్లు కూల్చివేశారు. దీనిపై ఇంజినీర్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఓ మహిళతో టీడీపీ నేతలు ఎదురు కేసు పెట్టించడం, దాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేయడం జరిగిపోయాయి. అయితే ఇల్లు ఇస్తామంటూ తన వద్ద సంతకం తీసుకున్నారని, తాను ఎవరిపై కేసులు పెట్టలేదని ఆ మహిళ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి  విన్నవించినప్పటికీ అప్పట్లో పోలీసు అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

పోలీస్‌ శాఖలో ఆగడాలను కొత్త బాస్‌లే అరికట్టాలి
ఇలా చెప్పకుంటూ పోతే జిల్లాలో కొందరు పోలీసు అధికారులు చేస్తున్న దాష్టికాలు, దౌరజ్జన్యాలతో పోలీసు శాఖ ప్రతిష్టదిగజారిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గుంటూరు రేంజ్‌ డీఐజీ, అర్బన్, రూరల్‌ ఎస్పీలు దృష్టి సారించి పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు