పోలీసుల పక్షపాతం

26 Mar, 2017 22:09 IST|Sakshi
పోలీసుల పక్షపాతం
- టీడీపీ వర్గీయుల ఆగడాలను నియంత్రించడంలో విఫలం
- అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలపై వేధింపులా
- పోలీసుల తీరుపై పీఏసీ చైర్మన్‌ బుగ్గన ఆగ్రహం
 
డోన్‌ టౌన్‌: శాంతిభద్రత పరిరక్షణలో పోలీసులు పక్షపాతం చూపుతున్నారని పీఏసీ చైర్మన్‌ , స్థానిక శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులకు నిరసనగా ఆయన కార్యకర్తలతో «ఆదివారం డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీ ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయానికి చేరుకోగా   అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ధర్నా నిర్ణయాన్ని విరమించి డోన్‌ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్‌ఐలు శ్రీనివాసులుతో పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు. టీడీపీ నాయకుల ఆగడాలు, పోలీసుల తీరును డీఎస్పీ దృష్టికి తెచ్చారు. 
 
మాఫీయా సామ్రాజ్యమా...
లారీ సుంకాల పేరుతో లారీ యజమానులు, డ్రైవర్లపై దాడులు చేస్తూ ప్రతిరోజు 20వేల రూపాయలను అక్రమంగా వసూళు చేస్తున్నారని ఇది మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధమని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఎక్కడపడితే అక్కడ మద్యం బెల్టుషాపులను అక్రమంగా ఏర్పాటు చేసినా ఎక్సైజ్‌ పోలీసులు కళ్లు మూసుకున్నారన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో ఆడవాళ్లు, అమాయాకులపై అధికార పార్టీ నాయకుల అనుచరులు అఘాయిత్యాలు, అరాచకాలు చేస్తున్నా అదుపు చేయడంలో విఫలమయ్యారని పిర్యాదు చేశారు. 
 
అక్రమ కేసుల్లో డోన్‌దే అగ్రస్థానం 
ఒక పథకం ప్రకారం ప్రతిపక్ష పార్టీ నాయకులపై, సామాన్య ప్రజానీకంపై అధికారపార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేసిన వెంటనే పోలీసులు అక్రమ కేసులు బనాయించడం రివాజుగా మారిందన్నారు. శుక్రవారం ఏకపక్షదాడుల అనంతరం చావుబతుకుల మధ్య ఉన్న వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజమని ఫిర్యాదు చేశారు. నిందితులకు మాత్రం రక్షణ కల్పించి పోలీసుల వాహనంలో ఇంటి వద్ద వదిలేయడం సిగ్గు చేటన్నారు. 
   
దురదృష్టకరమైన సంఘటన 
డోన్‌ పట్టణంలో జరుగుతున్న వరుస సంఘటనలపై పీఏసీ చైర్మన్‌ బుగ్గన అడిగిన ప్రశ్నలకు డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ సమాధానమిస్తూ శుక్రవారం సంఘటన తమనెంతో బాదించిందన్నారు. ఈ కేసులో కొందరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన సంఘటనలను తమకు అపాదించవద్దని కోరుతూ ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తమ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అనంతరం బుగ్గన వైఎస్‌ఆర్‌సీపీ తరపున నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.   
 
మరిన్ని వార్తలు