ట్రాఫిక్‌ ఉల్లంఘిస్తే.. సినిమా చూసిప్తారు

14 Sep, 2017 22:36 IST|Sakshi
ట్రాఫిక్‌ ఉల్లంఘిస్తే.. సినిమా చూసిప్తారు

– ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కొత్త సంస్కరణలు
– ఎక్కడ నుంచైనా ఈ– చలానాల ద్వారా జరిమానాలు
– నిందితులకు ప్రొజెక్టర్‌ ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన
–  విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జిల్లా పోలీసుశాఖ


ఈ ఏడాది ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులపై నమోదైన కేసులు : 8970
జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తం : రూ. 27.58 లక్షలు
డ్రంక్‌ డ్రైవ్‌ కేసుల : 401
ప్రతి ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య : 650 నుంచి 700
గాయపడుతున్న క్షతగాత్రులు : దాదాపు 5వేల మంది


రోడ్డుపై అతివేగంతో దూసుకుపోతున్నారా? రూల్స్‌ గీల్స్‌ జాంతా నై అనే భావనలో ఉన్నారా? ఇకపై రూల్స్‌ పాటించకపోతే మీకు ట్రాఫిక్‌ పోలీసులు 70ఎంఎం స్క్రీన్‌పై సినిమా చూపిస్తారు. ట్రాíఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే మీ భవిష్యత్‌ ఏవిధంగా మారబోతోందో కళ్లకు కట్టేలా అవగాహన కల్పించబోతున్నారు. ఇంద కోసం ప్రత్యేకంగా ‘ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌’ను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులను ఈ కేంద్రానికి పిలుచుకు వచ్చి సినిమాల ద్వారా అవగాహన కల్పించాలనే బృహత్‌ సంకల్పానికి ఆయన తెరలేపారు. శుక్రవారం నుంచి ఈ ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ పనిచేయనుంది. ప్రతి రోజూ ఉదయం ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులకు ఇక్కడ క్లాస్‌లు తీసుకోనున్నారు.
- అనంతపురం సెంట్రల్‌
 
రోడ్డు ప్రమాదాల రూపంలో ఆస్ట్రేలియాల్లో ఏడాదికి 350 మంది మృత్యువాత పడుతున్నారు. అదే మనదేశంలో 1.38 లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల విషయంలో మన రాష్ట్రం అగ్రగామిలో ఉంది.  మన జిల్లాకు వచ్చే సరికి ప్రతి ఏటా సగటున 650 నుంచి 700 వరకు రోడ్డు ప్రమాదాల రూపంలో పలువురు మృత్యువాత పడుతున్నారు. పోలీసు రికార్డుల ద్వారా ఇది స్పష్టమవుతోంది.

ఈ–చలానా జరిమానా
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీసులు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో రోడ్డుపై పోలీస్‌ సిబ్బంది నిలబడి ట్రాఫిక్‌ ఉల్లంఘించిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసేవారు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ఈ–చలానా పద్ధతిని నూతనంగా అమల్లోకి తీసుకొచ్చారు. గురువారం డీఐజీ ప్రభాకర్‌రావు, జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ అధికారికంగా ఈ –చలానా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఎక్కడి నుంచైనా నేరుగా వారి ఇంటికే ఈ–చలానా రూపంలో జరిమానాలు చెల్లించాలని రసీదులు పంపనున్నారు. మొన్నటి వరకూ నగరంలో సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులను గుర్తించి వారికి ఈ–చలానాలు పంపేవారు. ఇకపై ప్రతి ఎస్‌ఐ చేతిలో ఒక ట్యాబ్‌ ఉంటుంది. వాహన నంబర్‌ గుర్తిస్తే చాలు నేరుగా ఇంటికే ఈ చలానా వస్తుంది. మాన్యువల్‌ పద్ధతిలో కేసులు రాయడం ఇక నుంచి ఉండదు.

ఉల్లంఘనదారులకు అవగాహన
ఇప్పటి వరకూ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధించడమే ద్వారానే ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చనే భావనలో పనిచేస్తూ వచ్చారు. ఇక నుంచి జరిమానా చెల్లించిన తర్వాత కూడా ఉల్లంఘనదారులకు క్లాస్‌లు తీసుకోవాలని నిర్ణయించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులను ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌కు పిలుచుకెళ్లి వీడియో దృశ్యాలు చూపిస్తూ అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్నే నెలకొల్పారు. ఈ విభాగంలో ప్రత్యేక సిబ్బంది పనిచేయనున్నారు. రోడ్డు ప్రమాదంలో మనం మృతి చెందిన తర్వాత మన కుటుంబసభ్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనే విషయంపై అవగాహన కల్పించునున్నారు.

జరిమానా చెల్లించాల్సిందే
ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసులు పంపిస్తున్న చలానాలకు ఎక్కువమంది వాహనదారులు జరిమానాలు చెల్లించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం 8,970 మంది నుంచి జరిమానా రూపంలో రూ. 27.58 లక్షలు పోలీసులు వసూలు చేశారు. ఇంకా 20వేలకు చెల్లించాల్సిన వారు ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ఈ–చలానా ద్వారా ఒక్కసారి ట్రాఫిక్‌ ఉల్లంఘిస్తూ పట్టుబడితే కట్టేంత వరకూ ప్రతి వారం మెసేజ్‌ రూపంలో అలర్ట్‌ చేస్తుంది. వాహనం నడిపే వ్యక్తి సెల్‌ నంబర్, వాహన నంబర్‌ ఆధారంగా యజమాని సెల్‌ నంబర్‌ను ఈ-చలానాలో పొందుపరుస్తారు. దీంతో ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారికి చలానా చెల్లించేంత వరకూ సమాచారం వెళుతూ ఉంటుంది. ఇలా దాదాపు 100 సంవత్సరాలు డేటా నిక్షిప్తం అవుతుంది. ఎక్కడ పట్టుబడినా తెలిసిపోతుంది.

ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌తో సత్ఫలితాలు
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ–చలానాల ద్వారా జరిమానాలు పంపడం ఇందులో భాగమే అయినా.. ఉల్లంఘించిన వ్యక్తులకు ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో వీడియోల ద్వారా అవగాహన కల్పించడం మరో ఎత్తు. ఇలాంటి సెంటర్‌ను కడప జిల్లాలో ప్రవేశపెట్టి ఆశించిన మేర ఫలితాలను సాధించాను. జిల్లాలోని ప్రజలు కూడా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. ద్విచక్రవాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి.
- జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు