దౌర్జన్య కాండ..పోలీస్‌ అండ!

26 Mar, 2017 23:02 IST|Sakshi
వేలం పాటలు ముగిసిన అనంతరం కేశన్నగౌడ్‌ను జీపులో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పోలీసులు
- మితిమీరిన టీడీపీ నాయకుల దాడులు
- వైఎస్‌ఆర్‌సీపీ నాయకులే లక్ష్యం 
- టీడీపీకి అనుకూలంగా 
  మసులుతున్న పోలీసులు?
- బాధితులు ఫిర్యాదు చేస్తే..
  సాక్ష్యాలు కావాలంటూ వేధింపులు
- కేశన్న గౌడ్‌ను పోలీసు జీపులో తీసుకెళ్లి 
  ఇంటి దగ్గర దించడంపై తీవ్ర విమర్శలు 
 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. తమకు అడ్డుగా వచ్చిన వారిపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. భయభ్రాంతలకు గురిచేసి తమ అక్రమాలకు అడ్డులేకుండా చేసుకోవడమే వారి వ్యూహంగా ఉంది. ఇందుకు కొందరు పోలీసులు అండగా నిలబడడం విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్‌ వేలం పాటల సందర్భంగా డోన్‌ పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై జరిగిన దాడిలో ఇదే జరిగింది. ఇలాంటి ఘటనలే గతంలోనూ జిల్లాలో చోటు చేసుకున్నాయి. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు..దాడి చేసిన టీడీపీ నేతలకు అండగా ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉ న్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు.. పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
డోన్‌లో ఏం జరిగిందంటే..
ఇటీవల డోన్‌ మునిసిపల్‌ పరిధిలో వేలం పాటలను దక్కించుకునేందుకు టీడీపీ నాయకుడు, వైస్‌ చైర్మన్‌ కేశన్నగౌడ్‌ తన అనుచరులతో కలసి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై ఆటవికంగా దాడి చేయించారు.  ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండగా దాడి చేసిన వారికి పోలీసులు రక్షణ కల్పించారనే విమర్శలు ఉన్నాయి. దాడి అనంతరం పోలీసులు తమ జీపులో కేశన్న గౌడ్‌ను ఇంటి దగ్గర వదలడం విమర్శలకు బలాన్నిస్తోంది. అంతేగాక ఆయన రక్తపుబట్టలు మార్చుకొని బయటకు రాగా .. జీపులోనే వేలం పాటకు తీసుకెళ్లి పాట దక్కించుకునేలా వ్యవహరించారనే ఆరోపణలపై పోలీసుల శాఖలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
టీడీపీ నాయకుల అరాచకాలు..పోలీసుల ఏకపక్ష నిర్ణయాలు కొన్ని...
  •  హాలహర్వి మండలం మాచనూడుకు చెందిన అర్జున్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయం. అతను ఓ పంచాయితీ పెద్దగా వ్యవహరించాడనే సాకుతో అప్పటి ఎస్‌ఐ ఆయనకు ఏకంగా ఒకవైపు మీసం తీయించి అవమానపరచాడు. దీంతో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో ఎస్‌ఐను అక్కడి నుంచి బదిలీ చేశారు. 
  • వెల్దుర్తి మండలం చెరుకులపాడు నారాయణరెడ్డి ఇంటిపై టీడీపీకి చెందిన ఇసుక మాఫీయా సభ్యులు దాడి చేసి టాటాసుమోను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఏకంగా నారాయణరెడ్డి అనుచరులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
  • కల్లూరు మండలంలోని ఉలిందకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడుపై ఉన్న రౌటీషీటును పోలీసులపై ఒత్తిడితెచ్చి మళ్లీ ఎత్తివేయించారు.
  • వారం రోజుల క్రితం డోన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కొందరు వెళితే ఆధారాలు చూపమని ఆడిగారనే ఆరోపణలు ఉన్నాయి.
  • గతంలో డోన్‌లో శాంతియుతంగా ధర్నా చేసిన ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
  • ప్యాపిలి మండలం బూరుగలలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి జరిగితే దాడి చేసిన వారిపై కనీసం పోలీసులు కేసు నమోదు చేయలేదు.
 
పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడుతున్న జనం...
కొందరు పోలీసుల తీరుతో సామాన్య ప్రజలు పోలీసుస్టేషన్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. టీడీపీ నాయకుడు ఎవరైనా దౌర్జన్యం చేసినా, కొట్టినా స్టేషన్‌కు వెళ్లితే సాక్షా‍్యలు ఉన్నాయా అని పోలీసులు ప్రశ్నించడం విడ్డూరం. పైగా కేసును వెనక్కి తీసుకోకపోతే కౌంటర్‌ కేసును పెడతామని హెచ్చరిస్తున్నారు. అదే టీడీపీ నాయకులు కేసు నమోదుకు దరఖాస్తుచేసుకుంటే లేని పోని సెక‌్షన్లతో ప్రత్యర్థులు భయపడేలా చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీ నాయకులదీ అదే పరిస్థితి. జిల్లాలోని చాలా పోలీసు స్టేషన్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల చేతిలో కీలుబొమ్మలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. 
 
 
పోలీసులు విఫలం
జిల్లాలో శాంతి భద్రతలు లోపించాయి. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. టెండర్లలో టీడీపీ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయి. పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఇందుకు డోన్‌ సంఘటనే ఉదాహరణ. ప్రజలు పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారు. కేసు నమోదు చేయమని అడిగితే పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారు. ఇదేం విచిత్ర పరిస్థితో అర్థం కావడం లేదు. 
- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే 

 

మరిన్ని వార్తలు